ఆంధ్రాలో ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీని ఎన్నికలకి సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే ఎమ్మెల్యేలుగా, నియోజకవర్గ ఇంచార్జులుగా ఉన్న వారిలో పనితీరు బాగాలేని, ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్న నాయకులని ఈసారి తన ఎన్నికల టీము నుంచి తొలగించేందుకు జగన్ మోహన్ రెడ్డి సిద్ధం అయ్యారు. ప్రజల్లో గ్రాఫ్ సరిగ్గా లేనివారిని మార్చేయ్యాలన్నదానిపై దృష్టి పెట్టాలని వైసీపీ అధిష్టానం తీర్మానించింది.
ఈ క్రమంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ లో దాదాపుగా యాభై మంది ఎమ్మెల్యేలకు టిక్కెట్స్ దక్కని పరిస్థితి నెలకొంది. తాజాగా 11 నియోజకవర్గాల్లో కొత్త ఇంచార్జులను నియమించారు. రానున్న రెండు మూడు రోజుల్లో మిగతా చోట్ల కూడా కొత్త ముఖాలు కనిపిస్తాయి అని తెలుస్తోంది. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న వాళ్లకు సైతం టిక్కెట్స్ ఇవ్వడం ద్వారా తెలంగాణాలో కేసీఆర్ ఎలా దెబ్బతిన్నారో గుర్తించిన జగన్ ఇప్పట్నుంచే వైఎస్సార్ కాంగ్రెస్ లో దిద్దుబాటు చర్యలు ప్రారంభించినట్లుగా సమాచారం. ప్రజామోదం లేనివారికి టిక్కెట్స్ ఇచ్చేది లేదని ఈ ఇంచార్జుల మార్పు ద్వారా దాదాపుగా స్పష్టం చేసారు.
దీనిపై పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణరెడ్డి మాట్లాడుతూ
175 నియోజకవర్గాల్లో గెలుపే ప్రాతిపదికగా నిర్ణయం తీసుకున్నామన్నారు. వైఎసార్సీపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించాలని - వైఎస్ జగన్ సర్కార్ ఆచితూచి అడుగులు వేస్తోందని భవిష్యత్తులో కూడా మార్పులు ఉంటాయని అయన స్పష్టం చేసారు.
ఇదంతా గమనిస్తే 2024 ఎన్నికల కోసం జగన్ జెట్ స్పీడులో సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వెనుకబడిన వర్గాలకు మరింత గుర్తింపు, ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో ఇలా ఇంచార్జులుగా నియమించినట్లు చెబుతున్నారు.