జానారెడ్డితో రేవంత్ భేటీ.. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్టైలే వేరు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఆయన ప్రతి స్టెప్ ఆసక్తికరమే. ముందుగా ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టి జనం దృష్టిని ఆకర్షించారు. ఆ తరువాత సచివాలయంలోకి అందరికీ ఆహ్వానం.. ఆపై మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించడం.. ఆపై ప్రతి శుక్రవారం ప్రజాదర్బార్.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వంటివి ఆకట్టుకున్నాయి. టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన చేసిన మొదటి పని సీనియర్లను కలుపుకుని పోవడం. తనను విమర్శించిన వారి దగ్గరకు సైతం వెళ్లారు. ఇక ఇప్పుడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం సైతం రేవంత్ చేస్తున్నది అదే. కాంగ్రెస్ పార్టీ సీనియర్లందరితో వరుసగా భేటీ అవుతున్నారు.
ఎన్నికల్లో పోటీ చేయని జానారెడ్డి..
నేడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డితో భేటీ అయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జానారెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. జానారెడ్డి తన సతీమణితో కలిసి రేవంత్‌ను శాలువాతో సత్కరించి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక రేవంత్, జానారెడ్డిలు.. గంటపాటు భేటీ అయి రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. ఎన్నికల ఫలితాలతో పాటు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై రేవంత్‌ను జానా రెడ్డి ప్రశంసించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈసారి ఎన్నికల్లో జానారెడ్డి పోటీ చేయలేదన్న విషయం తెలిసిందే. ఆయన కుమారుడు జైవీర్ రెడ్డికి నాగార్జున సాగర్ టికెట్ ఇప్పించారు. జైవీర్ రెడ్డి సాగర్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
బెర్త్ కన్ఫర్మ్ చేసే అవకాశం ఉందా?
జానారెడ్డితో రేవంత్ భేటీ కావడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ఊహాగానాల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. జానారెడ్డి చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో హోంశాఖతో పాటు వివిధ శాఖలకు మంత్రిగా సైతం జానారెడ్డి పని చేశారు. సౌమ్యుడు, అజాతశత్రువుగా ఆయనకు పేరుంది. అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్‌లో 11 మంది మంత్రులు బాధ్యతలు చేపట్టగా.. మరో ఆరుగురికి అవకాశం ఉంది. జానారెడ్డితో రేవంత్ భేటీ అవడంతో కేబినెట్‌లో ఏమైనా బెర్త్ కన్ఫర్మ్ చేసే అవకాశం ఉందా? అందుకే ఆయన జానారెడ్డి నివాసానికి వెళ్లి ఉంటారా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.