వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి వైసీపీకి అలాగే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కొద్దిసేపటి క్రితం శాసనసభా కార్యదర్శికి ఆళ్ల రాజీనామా స్పీకర్ ఫార్మాట్‌లో లేఖ ఇచ్చారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నానని లేఖలో ఆళ్ల పేర్కొన్నారు. అయితే అనుచరులు మాత్రం మంగళగిరి నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదని అసంతృప్తితో ఆళ్ల ఉన్నారని చెబుతున్నారు. కనీసం రూ.1250 కోట్లు నిధులు ఇస్తామని హామీ ఇచ్చి కూడా మాట తప్పారట. పైగా నియోజకవర్గంలో విభేదాలు తారా స్థాయికి చేరుకున్నా కూడా ఏపీ సీఎం జగన్ లైట్ తీసుకున్నారు. తనను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆళ్ల రామకృష్ణా రెడ్డి కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ కారణాలతోనే ఆళ్ల రాజీనామా చేశారని అనుచరులు చెబుతున్నారు.
అప్పట్లో అదే హాట్ టాపిక్..
జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా మొదట్లో ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎందుకో గానీ వైసీపీపై చాలా నెలలుగా అసంతృప్తితో ఉన్నారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’పై ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి ప్యాలెస్‌లో నిర్వహించిన వర్క్‌షాప్‌కు హాజరు కాకపోవడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. తనకు వ్యతిరేకంగా మంగళగిరి తాడేపల్లి నగర అధ్యక్షుడు దొంతిరెడ్డి వేమారెడ్డి పార్టీ పేరుతో కార్యాలయం ఏర్పాటు చేసినా కూడా వైసీపీ అధిష్టానం పట్టించుకోకపోవడం ఆళ్లలో ఆగ్రహాన్ని మరింత పెంచింది. ఈ క్రమంలోనే మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు ఇటీవలి కాలంలో తారా స్థాయికి చేరుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. విభేదాలను సమసిపోయేలా చేసేందుకు సీఎం జగన్ ఏమాత్రం ప్రయత్నించలేదు సరికదా.. ఆళ్లను దూరం పెడుతూ వచ్చారు. దీంతో ఆళ్లలో అసంతృప్తి నానాటికీ పెరిగిపోయింది.
మంత్రి పదవి ఇస్తానని హామీ..
ఆళ్ల రామకృష్ణా రెడ్డి గత ఎన్నికలలో లోకేశ్‌పై విజయం సాధించి రెండోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పట్లో ఎన్నికల ప్రచారానికి మంగళగిరి వెళ్లిన జగన్.. ఆళ్లను గెలిపించుకుంటే మంత్రిని చేస్తానని అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ తరువాత ఆ హామీని గాలికి వదిలేశారు. కనీసం రెండో విడత కేబినెట్ విస్తరణలో అయినా మంత్రి పదవి ఇస్తారనుకుంటే అదీ జరగలేదు. కనీసం ఆళ్ల పేరును జగన్ పరిగణలోకి కూడా తీసుకోలేదు. వ్యక్తిగతంగానే కాకుండా పార్టీ పరువు కూడా తీసే విధంగా వ్యవహరించిన ఓ ఎమ్మెల్యేకు మాత్రం మంత్రి పదవి ఇచ్చి తనను పక్కనబెట్టడాన్ని ఆళ్ల సహించలేకపోయారు. ఈసారి కనీసం మంగళగిరి టికెట్‌ను సైతం ఆయనకు ఇచ్చే యోచనలో జగన్ లేరని తెలుస్తోంది. మొత్తానికి వైసీపీకి ఒక్కొక్కరుగా కీలక నేతలంతా దూరంగా ఉంటూ వస్తున్నారు.