ఉద్యోగులతో పెట్టుకుంటే కేసీఆర్ పీఠమే కదిలింది.. జగనెంత?
ఏపీలో పరిస్థితులు అంతకంతకూ విషమిస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగులు తిరగబడుతున్నారు. గతంలో కూడా ఉద్యోగులు ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఏపీ మొత్తం కదిలింది. ఏపీ చరిత్రలోనే ఇప్పటి వరకూ జరిగిన వాటిలో అదొక భారీ ఉద్యమం అనే చెప్పాలి. జగన్ ప్రభుత్వంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అసలు తమ సంక్షేమానికి జగన్ ఏం చేశారో చెప్పాలని నిలదీస్తున్నారు. ‘వై ఏపీ నీడ్స్ జగన్’ బుక్‌లెట్‌లో సచివాలయ ఉద్యోగుల నియామకానికి సంబంధించిన అంశం ప్రస్తావించడం మినహా చేసిందేమీ లేదంటున్నారు. మరోవైపు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సైతం చాలీచాలని వేతనాలతో కాలం వెళ్లదీస్తున్నారు.
వేతనాల పెరుగుదలకు సైతం జగన్ బ్రేక్..
సకాలంలో పీఆర్సీలు ఇస్తాం, డీఏలు చెల్లిస్తాం, వారంలో సీపీఎస్ రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు జగన్ ఉద్యోగులకు ఎన్నో హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చాక వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. గత ప్రభుత్వం 43 శాతం ఫిట్‌మెంట్ ఇస్తే జగన్ కేవలం 23 శాతమే ఇచ్చారని మండిపడుతున్నారు. వేతనాల పెరుగుదలకు సైతం జగన్ బ్రేక్ వేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీతాల నుంచి డబ్బు అయితే కట్ చేస్తున్నారు కానీ హెల్త్ కార్డులు మాత్రం జారీ చేయడం లేదని ఫైర్ అవుతున్నారు. జగన్ ప్రభుత్వ తీరుతో మనస్థాపం చెందిన ఓ ప్రభుత్వోపాధ్యాయుడు ఏకంగా ఆత్మహత్యకు యత్నించారు. తన చావుకు జగనే కారణమని లేఖ రాసి మరీ అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చిన్నముష్టూరు గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు మల్లేశ్.. పురుగుల మందు తాగారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది.
నిరుద్యోగుల పరిస్థితి ఏంటి?
ఉద్యోగుల దెబ్బకు అంత స్ట్రాంగ్ అయిన కేసీఆర్ పీఠమే కదిలింది.. ఇక ఏపీ సీఎం జగనెంత? అసలు నెల రాగానే జీతమందకుంటే ఏ ఉద్యోగి అయినా ఎలా కుటుంబాన్ని నడపగలడు? సంక్షేమం పేరిట ఖజానాను ఖాళీ చేసి.. అప్పులు తెచ్చి మరీ జనాలను సోమరులను చేయడం తప్ప జగన్ చేసిందేమీ లేదు. పోనీ సంక్షేమ పథకాలు అందుకుంటున్న కుటుంబాలు ఏమైనా బాగున్నాయా? అంటే అదీ లేదు. వారి జీవనం ఏదో సాగుతోంది. మరి ఆ కుటుంబంలోని నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? వారికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉందా? అంటే నోటిఫికేషన్లే లేవు. మొత్తానికి సంక్షేమం మరోసారి తనను నిలబెడుతుందన్న ధీమాతో జగన్ ఉన్నారు కానీ అటు సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందిన కుటుంబాలు.. ఇటు ఉద్యోగులు ఏవీ సంతోషంగా లేవు. మొత్తానికి జగన్ అయితే తన గొయ్యి తనే తవ్వుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.