రేవంత్‌ను మించిపోయిన మరో సీఎం.. షాకింగ్ నిర్ణయాలు..
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా తాజాగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆ వెంటనే ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆసక్తికరంగా మారాయి. ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే ఒక గ్యారంటీని అమల్లోకి తీసుకొచ్చారు. దీనిలో భాగంగా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. ఇక ప్రగతి భవన్‌ను ప్రజాదర్బార్ చేసేశారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా వరుసలతో పిలుస్తూ దగ్గరకు తీశారు. ప్రభుత్వ కాన్వాయ్‌ను పక్కనబెట్టేసి సొంత వాహనంలోనే ప్రయాణం చేస్తూ సాధారణ నాయకుడి మాదిరిగానే వ్యవహరిస్తున్నారు. ప్రజలకు చేరువయ్యే నిర్ణయాలెన్నో తీసుకుంటున్నారు.
నిర్ణయాల్లో రేవంత్‌ను మించిపోయిన లాల్..
రేవంత్ గురించి దేశమంతటా ఆసక్తికర చర్చ జరుగుతున్న నేపథ్యంలో అంతకు మించిన చర్చ మరో నూతన సీఎం గురించి జరుగుతోంది. ఆయన మరెవరో కాదు.. మిజోరాం సీఎం, జోరం పీపుల్స్ మూమెంట్(జెడ్‌పీఎం) అధినేత లాల్ దుహోమా. ఆయన వయసులోనే కాదు.. నిర్ణయాల్లోనూ రేవంత్‌ను మించిపోయారు. కేవలం 40 అసెంబ్లీ స్థానాలున్న మిజోరాంలో జెడ్‌పీఎం 27 స్థానాలను సాధించి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ పార్టీ అధినేత లాల్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ప్రమాణ స్వీకార సమయం నుంచి కూడా లాల్ ఆకట్టుకునే నిర్ణయాలు తీసుకుంటున్నారు. సామాన్య ప్రజానీకాన్ని తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించడమే కాకుండా.. ఆ కార్యక్రమాన్ని రాజకీయం చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వం నిర్మించిన క్వార్టర్స్‌లోనే ఉండాలి..
ఆ తరువాత ఆయన తొలి నిర్ణయమేంటో తెలుసా? మంత్రులు, ఎమ్మెల్యేలకు కొత్త వాహనాలు కొనేదే లేదు.. గత ప్రభుత్వం వినియోగించిన వాహనాలనే వాడుకోండంటూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే వారికి ప్రత్యేక భవనాలు కూడా కేటాయించేది లేదని.. ప్రభుత్వం నిర్మించిన క్వార్టర్స్‌లోనే ఉండాలని తేల్చి చెప్పారు. ఒకవేళ బయట ఉండాలనుకుంటే మాత్రం సొంతంగా అద్దె కట్టుకోవాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో పని చేసిన కాంట్రాక్టర్లకు అభయ హస్తం అందించారు. వారంతా హ్యాపీగా పని చేసుకోవాలని.. బిల్లులు వెంటనే ఇచ్చేస్తామని తెలిపారు. కానీ నాణ్యతలో రాజీ పడితే మాత్రం సహించబోమని తెలిపారు. అలాగే ప్రభుత్వోద్యోగులు సమయపాలన పాటించకుంటే మాత్రం జీతం కట్ చేస్తామని తెలిపారు. మొత్తానికి ప్రభుత్వం మారితే బిల్లులు చెల్లించకుండా ఇబ్బంది పెట్టే ప్రభుత్వాలను చూశాం కానీ ఇలా హ్యాపీగా పని చేసుకోవాలనే సీఎంను చూడలేదని జనం అంటున్నారు. లాల్ నిర్ణయాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.