రేవంత్‌కు.. జగన్‌కు ఎంత తేడా..
తెలుగు రాష్ట్రాల్లో.. ఒక చోట ఏం జరిగినా అది రెండో రాష్ట్రంలోని పరిస్థితులతో కంపేర్ చేయడం సర్వసాధారణం. సీఎంల విషయానికి వచ్చినా కూడా అదే పరిస్థితి. ఏదైనా సిట్యువేషన్‌లో ఒక రాష్ట్ర సీఎం వ్యవహారశైలిని.. అలాంటి పరిస్థితిలోనే మరో రాష్ట్ర సీఎం వ్యవహార శైలిని పోల్చడం ఈనాటిది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయినప్పటి నుంచి జరుగుతూనే ఉంది. తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టింది. రేవంత్ రెడ్డి సీఎం పగ్గాలు చేపట్టారు. ఇక అది మొదలు తెలంగాణ సీఎంతో ఏపీ సీఎం పోలిక ప్రారంభమైంది. జనాలు ప్రతి ఒక్క పని విషయంలోనూ కంపేర్ చేసి ఏపీ సీఎం జగన్‌ను ఏకిపారేస్తున్నారు.
తెలంగాణ ఎన్నికల ప్రచారంలోనూ జరిగిందిదే..
రాజకీయాల్లో అధికార, విపక్షాల మధ్య విమర్శలనేవి కామన్. అయితే అవి శృతి మించకుండా కేవలం రాజకీయాలకే పరిమితమైతే బాగుంటుంది. అలా కాకుండా వ్యక్తిగత విమర్శలనేవి ఎవరికైనా జుగుప్సను కలిగిస్తాయి. ఇక ఎన్నికలు వచ్చాయంటే విమర్శలకు పండగే. నేతలంతా పోటీలు పడి మరీ వాడేస్తుంటారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే జరిగింది. కేసీఆర్, రేవంత్ ఒకరిపై మరొకరు బీభత్సంగా విమర్శలు చేసుకున్నారు. ఇక ఎన్నికల్లో విజయం సాధించి రేవంత్ సీఎం అయ్యారు. కేసీఆర్ బాత్రూంలో కాలు జారి పడి ఆసుపత్రి పాలయ్యారు. అయితే కేసీఆర్ పట్ల రేవంత్ వ్యవహరించిన తీరును చూసిన ఏపీ ప్రజానీకం జగన్‌పై తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోస్తోంది.
భద్రత పెంచాలని ఆదేశాలు..
కేసీఆర్ పడిపోయారని ఇష్టానుసారంగా మాట్లాడటమో.. నోటికి పని చెప్పడమో రేవంత్ చేయలేదు. చాలా హూందాగా వ్యవహరించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలంటూ ఎక్స్‌లో స్పందించారు. అలాగే కేసీఆర్ చికిత్స పొందుతున్న యశోద ఆసుపత్రి వద్ద భద్రత పెంచాలని అధికారులను ఆదేశించారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులకు తెలిపారు. ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టై రాజమండ్రి జైలులో ఉన్న సమయంలో అనారోగ్యం పాలయ్యారు. అప్పుడు ఆయన పట్ల, ఆయన ఆరోగ్యం పట్ల ఏపీ సీఎం జగన్ వ్యవహార శైలిని జనం దుమ్మెత్తి పోస్తున్నారు. చంద్రబాబును ముసలోడని సంబోధిస్తూ జగన్ రకరకాల కామెంట్స్ చేశారు. ఆ సమయంలోనూ ఆయనపై మరికొన్ని కేసులు మోపేందుకు యత్నించారు. రేవంత్‌కు.. జగన్‌కు ఎంత తేడా ఉందో.. ఒకరు హూందాతనానికి ఐకాన్ అయితే మరొకరు అహంకారానికి ఐకాన్ అంటూ జనం చర్చించుకుంటున్నారు.