అధికారంలో ఉంటే ఉండే లెవలే వేరు.. అడుగులకు మడుగులొత్తుతారు. తలనొప్పి వచ్చినా పరామర్శలు.. ఎటు వెళ్లినా మందీ మార్చలం.. అదే అధికారం పోయిందో పులి కూడా పిల్లై పోతుంది. తిరిగి చూసేవారే ఉండరు. తలనొప్పి మాట అటుంచితే తుంటి విరిగినా పట్టించుకోరు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ది ప్రస్తుతం అదే పరిస్థితి. అంతా బాగుండి తిరిగి ఆయన సీఎం అయి ఉంటే.. ఏపీ సీఎం జగన్ పొటాటోని ఉల్లిపాయే అంటారా? అని ప్రశ్నలు వేస్తూ కూర్చోకుండా ముందు కేసీఆర్‌ని పరామర్శించి ఆ తరువాత తుపాను బాధిత రైతులను పరామర్శించి ఉండేవారు. ఇప్పుడు సీన్ రివర్స్.. వైసీపీ నుంచి ఒక్కరు కూడా కేసీఆర్ వైపు చూసిన పాపాన పోలేదు. ఒక్క విజయసాయిరెడ్డి మాత్రం ట్వీటేసి సైలెంట్ అయిపోయారు.
ఆ కృతజ్ఞతతోనే కేసీఆర్‌కు జగన్ సహకారం..
2019 ఏపీ శాసనసభ ఎన్నికలలో తెలంగాణలో వైసీపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఘన విజయం వెనుక కేసీఆర్ ఉన్నారనేది జగనెరిగిన.. జగనెరిగిన సత్యం. ఆ సమయంలో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆఘమేఘాల మీద వెళ్లి ఆయనను కలిసి కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. ఇద్దరి ఉమ్మడి శత్రువైన చంద్రబాబును ఓడించినందుకు ఆనందాన్ని ఓ రేంజ్‌లో పంచుకున్నారు. ఈ కృతజ్ఞతతోనే జగన్ ఎన్నో విషయాల్లో కేసీఆర్‌కు సహకరించుకుంటూ వచ్చారు. ఎన్ని విమర్శలొచ్చినా అసలేమాత్రం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు కేసీఆర్ తెలంగాణలో అధికారాన్ని కోల్పోయారు. తాజాగా బాత్రూంలో జారిపడితే ఆయన తుంటి ఎముక విరిగింది. ప్రస్తుతం ఆయన యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
గెట్ వెల్ సూన్ అంటూ ఓ మెసేజ్ పెట్టారా?
కేసీఆర్ పరిస్థితి అలా ఉంటే జగన్ రయ్‌న రావాలి కదా.. కానీ ఆయన పొటాటోలంటే ఉల్లిపాయలే కదా అనుకుంటూ ఏపీలోనే కూర్చొండిపోయారు. కనీసం సోషల్ మీడియా వేదికగా అయినా గెట్ వెల్ సూన్ అంటూ ఓ మెసేజ్ పెట్టారా? అంటే అదీ లేదు. పోనీ ఆయన తరుఫున ఎవరినైనా కేసీఆర్‌ను పరామర్శించేందుకు పంపించారా? అంటే అది కూడా లేదు. అధికారం కోల్పోతే పరిస్థితి ఇలా ఉంటుందా? అని కేసీఆరే ముక్కున వేలేసుకునే పరిస్థితి. నిన్నటి వరకూ కింగ్‌లా తిరిగిన కేసీఆర్‌ను ఇప్పుడు జగన్ కూడా పరామర్శించడం లేదు. ఆయన అధికారం కోల్పోయారు కాబట్టి ఇక ఆయనతో మనకేం పని అనుకుంటున్నారో లేదంటే.. ఈ సమయంలో కేసీఆర్‌ను పరామర్శిస్తే ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళతాయనో ఆగిపోయినట్టున్నారు. మొత్తానికి కేసీఆర్‌ను జగన్ పరామర్శించకపోవడంపై రకరకాల కథనాలు సోసల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.