కాంగ్రెస్ 6 గ్యారంటీల హామీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని తెలంగాణ ప్రభుత్వం నేటి నుంచి కల్పించనున్న విషయం తెలిసిందే. సిటీలోని ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లతో పాటు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో ఈ సౌకర్యం వినియోగించుకోవచ్చు. అలాగే వయస్సుతో సంబంధం లేకుండా బాలికలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్స్ సైతం ఉచిత ప్రయాణానికి అర్హులే. ఇక ఇదంతా బాగానే ఉంది. అసలే ఆర్టీసీ అంటే ఎప్పుడూ నష్టాల్లోనే ఉంటుంది కదా.. మరి ఈ ఉచిత బస్సు ప్రయాణమనేది మరింత ఆర్టీసీని ఊబిలోకి నెట్టేస్తుంది. అలాంటప్పుడు ఆ లోటును ఆర్టీసీ ఎలా భర్తీ చేసుకుంటుందనే టాక్ నడుస్తోంది. అయితే అసలు మన రాష్ట్రంలో కంటే ముందుగా కర్ణాటకలో మొదలు పెట్టారు. అదెలా ఉంది? అక్కడి ఆర్టీసీ నష్టాల్లో ఉందా? లాభాల బాటలో పయనిస్తుందా? అనే అంశాలను ఒక్కసారి పరిశీలిస్తే.. తెలంగాణలో ఆర్టీసీకి లాభమో నష్టమో తేలుతుంది.
సైడ్ ఇన్‌కమ్ పెరిగిందట..
కర్ణాటకలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో భాగంగా.. మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించింది. అక్కడ సిద్ధరామయ్య అధికారంలోకి రాగానే శక్తి పథకం ద్వారా మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడం జరిగింది. ఇక్కడ అయితే ఆర్టీసీకి లాభాలే వస్తున్నాయని టాక్. మామూలు రోజుల మాదిరిగానే వీకెండ్స్ కూడా బస్సులు ఫుల్ బిజీబిజీగా తిరిగేస్తున్నాయట. మహిళలు ఎక్కడికి వెళ్లాలన్నా ఆర్టీసీనే వినియోగిస్తున్నారట. మరి వారు ఒక్కరే అన్ని ప్రదేశాలకు వెళ్లలేరు కాబట్టి మగవాళ్లు కూడా బస్సుల్లోనే ట్రావెల్ చేస్తున్నారట. తద్వారా ఆర్టీసీ ఆదాయం పెరిగిందట. పైగా టూరిజానికి డిమాండ్ పెరిగిందట. బస్సులు ఫ్రీ అయినా కూడా షాపింగ్స్ అనేవి ఫ్రీ కాదు కదా. మహిళలు బీభత్సంగా షాపింగ్స్ చేస్తుండటంతో ఆర్టీసీకి సైడ్ ఇన్‌కమ్ పెరిగిందని కేఎస్ఆర్టీసీ నివేదికలు చెబుతున్నాయి. గతంలో ఎయిర్‌పోర్టుకు వెళ్లే బస్సుల్లో మాత్రమే రద్దీ ఉండేదట. ఇప్పుడు ఏ బస్సు చూసినా రద్దీగానే ఉంటోందట.
తెలంగాణలో కేవలం కేవలం 7,200 బస్సులే..
అందరి ఊహాలకూ అతీతంగా బీఎంటీసీ అయితే నష్టాల నుంచి బయటపడిందని సమాచారం. ప్రస్తుతం కర్నాటకలో 17 వేల బస్సులు మాత్రమే ఉండగా.. పెరిగిన రద్దీతో మరో అదనంగా మరికొన్ని బస్సులు కొనేందుకు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించిందని టాక్. కర్ణాటక పరిస్థితి అది. మరి తెలంగాణలో దీనికి భిన్నంగా ఉండే అవకాశం లేదని అంతా భావిస్తున్నారు. ఈ లెక్కలన్నీ వేసుకునే తెలంగాణలో సైతం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందట. అయితే తెలంగాణలో కేవలం 7,200 బస్సులు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే అవి అసలు సరిపోవడం లేదు. పైగా ఉచితం అనేసరికి బస్సుల్లో రద్దీ పెరుగుతుంది. దీనికోసం రాబోయే రోజుల్లో కొత్త బస్సులు కొనుగోలు చేయనున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెబుతున్నారు. వారం రోజుల వరకూ ఎలాంటి గుర్తింపు కార్డు అవసరం లేదు కానీ వారం తర్వాత మాత్రం మహాలక్ష్మి కార్డులు తీసుకోవాల్సిందే..