మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ అకౌంట్.. అదే ఎక్స్ అకౌంట్ ప్రొఫైల్ పిక్ మారింది. ఈ పిక్ చూస్తుంటే కచ్చితంగా ఇది ఆయన తదుపరి సినిమా లుక్కే అని అంతా ఫిక్సయిపోతున్నారు. అంతే, ఎక్స్ వేదికగా లుక్ బాగుంటుందంటూ ఒకటే కామెంట్లు. నిజంగానే ఈ మేకోవర్‌లో చిరు కాస్త యంగ్ లుక్‌లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్టతో విశ్వంభర అనే సినిమా చేస్తున్నారు చిరు. వాల్తేరు వీరయ్య తర్వాత వచ్చిన భోళా శంకర్ భారీ డిజాస్టర్ కావడంతో.. చిరు ఇప్పుడో సెన్సేషనల్ హిట్టు కొట్టి.. బాక్సాఫీస్‌ని రఫ్ ఆడించాల్సి ఉంది. అందుకే విశ్వంభర విషయంలో ప్రతీది పర్ఫెక్ట్‌గా సెట్ చేస్తున్నారనేలా టాక్ వినబడుతోంది.
అందులో భాగంగా చిరు తన ప్రొఫైల్ పిక్ మార్చారని, విశ్వంభరలో తన లుక్ గురించి జనాలకు తెలియాలనే ఇలా ప్లాన్ చేశారనేలా టాక్ మొదలైంది. ఈ పిక్‌లో బ్లాక్ బనియన్‌పై ఖాకీ కలర్ షర్ట్, బ్లాక్ కలర్ గ్లాసెస్, ట్రెండీ హెయిర్ స్టైల్‌తో చిరు దర్శనమిచ్చారు. ఫాంటసీ అడ్వెంచర్‌గా తెరకెక్కబోతోన్న ఈ సినిమా మెగాస్టార్‌కి 156వ చిత్రం. ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమాని యువి క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. విశ్వంభర అనేది టైటిల్. అయితే.. టైటిల్‌ని ఇంకా అధికారికంగా మేకర్స్ ప్రకటించలేదు. అలాగే చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఫస్ట్ మ్యూజిక్ రికార్డింగ్‌తోనే ప్రారంభించారు.
ఇక చిరు విషయానికి వస్తే.. వాల్తేరు వీరయ్యతో తన సత్తా ఏంటో చాటిన మెగాస్టార్.. భోళా శంకర్ రిజల్ట్‌తో కాస్త నిరాశలో ఉన్నారు. కానీ ఈ విశ్వంభరపై మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారని తెలుస్తోంది. కారణం.. మెగాస్టార్ కోసం వశిష్ట అలాంటి సబ్జెక్ట్‌ని సిద్ధం చేశాడని, కచ్చితంగా రికార్డులు బద్దలవుతాయని చిత్రబృందం, ఫ్యాన్స్ భావిస్తున్నారు.