గత రెండు, మూడు రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతుంది చూస్తుంటే.. కచ్చితంగా ఏదో అయితే జరగబోతుందనేది అర్థమవుతోంది. దేని గురించి అని అనుకుంటున్నారా? అదే నెట్ ఫ్లిక్స్ సీఈఓ అండ్ టీమ్ గురించి. గురువారం మెగాస్టార్ చిరు ఇంట్లో, శుక్రవారం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంట్లో దర్శనమిచ్చిన నెట్ ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సరండోస్ అండ్ టీమ్.. నేడు (శనివారం) మహేష్ బాబు ఇంట్లో మెరిశారు. ఈ టీమ్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు అతిథ్యమిచ్చారు.
అసలు ఇలా వీరు స్టార్ హీరోల ఇంటికి వెళ్లడానికి కారణం ఏమై ఉంటుందనేది మాత్రం ఇంత వరకు తెలియరాలేదు. ఏదైనా అవార్డ్స్ ఫంక్షన్ చేయాలని అనుకుంటున్నారా? అందుకోసం వీరిని ముఖ్య అతిథిలుగా ఆహ్వానిస్తున్నారా? లేక ఓటీటీ కాంపిటేషన్‌లో ఏదైనా వినూత్నమైన ప్లాన్‌ని టాలీవుడ్ స్టార్ హీరోలతో అమలు చేయబోతున్నారా? అనేది మాత్రం తెలియకుండా ఉంది. ప్రస్తుతం విడుదలవుతోన్న సినిమాలన్నింటినీ దాదాపు నెట్‌ఫ్లిక్స్ సంస్థే సొంతం చేసుకుంటుంది. వారి ఊపు చూస్తుంటే బిగ్గరగానే ఏదో ప్లాన్ చేసినట్లుగా అయితే అర్థమవుతోంది. అదేంటనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయకతప్పదు.
సూపర్ స్టార్ విషయానికి వస్తే.. ప్రస్తుతం గుంటూరు కారం ఫినిష్ చేసే పనిలో ఆయన బిజీగా ఉన్నారు. నాన్‌స్టాప్‌గా షూటింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. కేవలం ఇంకో పాట మాత్రమే చిత్రీకరణ జరపాల్సి ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అన్నట్లు.. నెట్‌ఫ్లిక్స్ సీఈఓ అండ్ టీమ్ మహేష్ ఇంట్లో దర్శనమిచ్చిన సందర్భంలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత సూర్యదేవర నాగవంశీ కూడా అక్కడే ఉన్నారు.