టాలీవుడ్ లో మెగా, నందమూరి ఫ్యామిలీలు అనగానే ఎటువంటి యుద్ధ వాతావరణం ఉంటుందో తెలిసిందే. అలాంటిది ముందు మెగా, తరువాత నందమూరి అంటే ఏంటో అనుకుంటారేమో. అటువంటి యుద్ధ వాతావరణానికి సంబంధించిందేం కాదీ వార్త. అసలు విషయానికి వస్తే నెట్ ఫ్లిక్స్ సిఈఓ టెడ్ సరండోస్ నిన్న (గురువారం) మెగా ఫ్యామిలీని కలుసుకున్నారు. ఒక రోజు వ్యవధిలోనే అనగా శుక్రవారం నందమూరి ఫ్యామిలీని అతిథిగా కలిశారు. దీనితో సోషల్ మీడియాలో ముందు మెగా, తరువాత నందమూరి అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.
అసలు ఇంత సడెన్ గా నెట్ ఫ్లిక్స్ సిఈఓ ఈ ఇద్దరు స్టార్ హీరోలని (రామ్ చరణ్, ఎన్టీఆర్) కలవడం అనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఓటీటీ రంగంలో నెట్ ఫ్లిక్స్ టాప్ స్థానంలో దూసుకెళుతున్న తరుణంలో.. నెట్ ఫ్లిక్స్ ఈ ఆర్ ఆర్ ఆర్ హీరోలతో ఏదైనా కొత్తగా ప్లాన్ చేస్తున్నారా? లేక ఓటీటీ రంగంలో మరింత ముందుకు దూసుకుపోయేలా వీరిద్దరిని కలవడం అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. అసలు విషయం ఏమైనప్పటికి ఇలా ఒక సిఈఓ టాలీవుడ్ హీరోలని కలవడం అనేది హాట్ టాపిక్ గా మారింది.
రామ్ చరణ్ విషయానికి వస్తే శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. తరువాత బుచ్చిబాబు సానా దర్శకత్వంలో RC 16 షూటింగ్ లో పాల్గొననున్నారు. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమా కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా తరువాత వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ పాల్గొననున్నారు. ఆ తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. నెట్ ఫ్లిక్స్ సిఈఓ మెగా ఫ్యామిలీని కలిసినప్పుడు రామ్ చరణ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్‌లు కూడా ఉన్నారు. నందమూరి ఫ్యామిలీని కలిసినప్పుడు కొరటాల శివ, కళ్యాణ్ రామ్ కూడా వారితో ఉన్నారు.