అవసరమైతే రాజకీయాల్లోకి వస్తా అన్నారు మంచు మనోజ్. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న మంచు మనోజ్ తిరిగి మళ్ళీ యాక్టివేట్ అయ్యారు. హీరోగా కొత్త సినిమాలను లైన్ లో పెడుతూనే, వ్యాఖ్యాతగానూ తన టాలెంట్ చూపేందుకు సిద్ధమయ్యారు. ఆయన హోస్ట్ గా ఓటీటీలో ఓ గేమ్ షో ప్రారంభమైంది. ఈ షోకు సంబంధించి రీసెంట్ గా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మనోజ్ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ పొలిటికల్ ఎంట్రీ పై స్పందించారు.
ఏడేళ్ల గ్యాప్ తర్వాత ఏడడుగులు వేసి మళ్ళీ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నా. ఈ గ్యాప్ లో నేను మరో జీవితాన్ని చూశా. మోనిక ప్రేమలో పడిన తర్వాతే ఫాన్స్ నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో, అభిమానిస్తున్నారో అర్ధమైంది. ఇన్నాళ్లు గ్యాప్ తీసుకుని వాళ్ళని నిరాశ పరిచినందుకు సారీ చెబుతున్నాను. ఇకపై మాత్రం వినోదం ఒక రేంజ్ లో నా నుండి వస్తుంది. ప్రామిస్ అని మనోజ్ చెప్పారు.
పాలిటిక్స్ లోకి వస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి కదా.. అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. సొసైటీకి మంచి చేయాలనే ఆలోచన నాకు మొదటి నుండి ఉంది. భవిష్యత్తులో అందుకోసం రాజకీయాల్లోకి రావాలనుకుంటే వస్తానని అన్నారు. ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతూ.. నేను ఏ పార్టీకి ఓటు వేయమని ఇప్పటి వరకు చెప్పలేదు. నాకు తెలిసిన వాళ్ళు ఏ పార్టీలో పోటీ చేసినా సపోర్ట్ చేశా. భవిష్యత్తులో నా భార్య ఎటువంటి నిర్ణయం తీసుకున్నా.. ఆమెకు అండగా నిలబడతానని అన్నారు.