మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తెలుగు-హిందీ ద్విభాషా చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. ఈ సినిమా డిసెంబర్ 8 విడుదల అంటూ మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా అనుకున్న టైంకి విడుదల కావడం లేదు. తాజాగా ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ప్రేక్షకులకు మంచి సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ ఇవ్వడానికి టీం కృషి చేస్తుందని, త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామని అధికారికంగా మేకర్స్ తెలిపారు.
ఈ సినిమాతో వరుణ్ తేజ్ హిందీలో అరంగేట్రం చేస్తున్నారు. యదార్ధ సంఘటన స్ఫూర్తితో రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా కనిపించనున్నారు. మానుషి చిల్లర్ ఈ చిత్రంతో తెలుగు అరంగేట్రం చేస్తోంది. ఇందులో ఆమె రాడార్ ఆఫీసర్ పాత్రను పోషించింది. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో కీలక పాత్రలో నవదీప్ కనిపించనున్నారు.
భారతదేశం ఎన్నడూ చూడని అతిపెద్ద వైమానిక దాడుల్లో మన వైమానిక దళం హీరోలు, వారు ఎదుర్కొన్న సవాళ్లను ఈ చిత్రంలో కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నారు. ఈ విజువల్ వండర్ ని భారీ కాన్వాస్‌పై రూపొందిస్తున్నారు. 2022లో విడుదలైన ‘మేజర్’ భారీ విజయం తర్వాత సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ మరో దేశభక్తి కథతో తిరిగి వస్తోంది. సినిమాటోగ్రాఫర్, వీఎఫ్ఎక్స్ నిపుణుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా, అమీర్ ఖాన్, సిద్ధార్థ్ రాజ్ కుమార్ ఈ సినిమాకు రైటర్స్. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ బ్యానర్స్ పై సందీప్ ముద్దా నిర్మిస్తున్నారు. నందకుమార్ అబ్బినేని, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ సహా నిర్మాతలు.