తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు, అశేష జనవాహిని నడుమ ఆయన ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది. రేవంత్‌తో పాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ప్రజల కళ్లన్నీ రేవంత్ మీదే ఉన్నాయి. ఆయన తొలి స్టెప్ ఎలా ఉంటుంది? ఏం చేయబోతున్నారు? ఎలా పరిపాలించబోతున్నారు? అనే అంశాలన్నీ ఆసక్తికరంగా మారాయి.
సినిమాలో చూసినట్టుగా మారిపోయాయ్..
రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు కానీ ఆయన సీఎం అవుతారని 2-3 నెలల ముందు వరకూ ఎవరూ ఊహించలేదు. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఏమాత్రం అనుకోలేదు. అలాంటిది రేవంత్ టీపీసీసీ చీఫ్‌గా అధికారం చేపట్టాక కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్‌కు ఓ ప్రత్యామ్నాయం అనే విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. అసలే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పైకి దూకుడుగా దూసుకెళ్లే రేవంత్ సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా మారిందని జనం నమ్మారు. అలాగే కర్ణాటక ఎన్నికల ఫలితాలు సైతం తెలంగాణ కాంగ్రెస్‌కు కావల్సినంత బూస్ట్ ఇచ్చాయి. పరిస్థితులన్నీ ఏదో సినిమాలో చూసినట్టు చకచకా మారిపోయాయి. వెరసి రేవంత్ సీఎం అయ్యారు.
ఆరు గ్యారెంటీలపై తొలి సంతకం..
ప్రమాణ స్వీకారానికి ముందే ప్రగతి భవన్ గేట్లు బద్దలు చేస్తానని చెప్పినట్టుగానే.. ఎత్తయిన గ్రిల్స్, బారీకేడ్స్‌ను తొలగించేలా రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రగతి భవన్ ముందు రోడ్డు పక్కగా ఏర్పాటు చేసిన షెడ్‌ను కూడా తీసేయాలని ఆదేశించారు. సామాన్య ప్రజలు నేరుగా ప్రగతి భవన్‌లొకి వచ్చేలా అవకాశం కల్పిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. ఆ వెంటనే మొదటి ఉద్యోగం ఇస్తానని రజనీ అనే మరుగుజ్జు యువతికి దాదాపు రెండు నెలల క్రితం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆ హామీని గుర్తు పెట్టుకుని మరీ రజనీని తన ప్రమాణ స్వీకారానికి రేవంత్ రెడ్డి పిలిపించారు. రజనీ ఉద్యోగ నియామక పత్రంపై రెండో సంతకం చేశారు. ఇక తొలి సంతకం ఏదంటారా? ఆరు గ్యారెంటీలకు సంబంధించిన ఉత్తర్వులపై చేశారు. మొత్తానికి రేవంత్ జనాలను తొలి రోజు అయితే విశేషంగా ఆకట్టుకున్నారు. ఇక పోతే ఆయన పరిపాలన కూడా అద్భుతంగా ఉండబోతోందని తొలి స్టెప్స్ చూస్తుంటేనే అర్థమవుతోందని తెలంగాణ ప్రజానీకం సంబరపడుతోంది.