తెలంగాణకు ఏకైక గొంతు కేసీఆర్, బీఆర్ఎస్.. ఆ రెండింటిని ప్రజలు వదులుకోరు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రీసెంట్‌గా జరిగిన తెలంగాణ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ తక్కువ సీట్లకే పరిమితమై.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని పోగొట్టుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ.. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా మారిపోయింది. అయితే బీఆర్ఎస్ తరపున గెలిచిన నేతలంతా తమను గెలిపించిన నియోజకవర్గాల ప్రజలకు ధన్యవాదాలు చెప్పే ప్రక్రియలో ఉన్నారు.
అందులో భాగంగా కేటీఆర్ సిరిసిల్లలో ముఖ్య నాయకులతో, కార్యకర్తలతో సమావేశమయ్యారు. తనను 30 వేల మెజారిటీతో గెలిపించిన సిరిసిల్ల ప్రజలకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో అనుకోని ఫలితాలు రావడం సహజం.. నిరాశ పడాల్సిన అవసరం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే పోరాటాల నుంచి, పోరాటాలు మనకేం కొత్త కాదని పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష పాత్రలో ప్రజల తరపున మాట్లాడుదాం అన్నారు. నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని.. రాష్ట్రంలో ఎన్నో రకాలు అనుభవాలు ఎదరయ్యాయి కానీ.. సిరిసిల్ల ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు, కుట్రలకు లొంగకుండా.. మరోసారి అభివృద్ధికే పట్టం కట్టినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.
గతంలో రెండు సార్లు మాకు అధికారం ఇచ్చారు. అందుకు ఎప్పటికీ రుణ పడి ఉంటాం. ఇవాళ అధికారం రాలేదని బాధపడటం లేదని.. ప్రతిపక్ష పాత్రలో ప్రజల గొంతుకై నిలబడతామని తెలిపారు. గెలిచిన పార్టీ వాళ్లు చాలా పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. వాటన్నింటినీ ప్రజలు రాసిపెట్టుకున్నారు. అవి నెరవేరే వరకు మేము ప్రజల పక్షాన నిలబడతాం. ఇది తాత్కలికమైన స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని కేటీఆర్ చెప్పుకొచ్చారు.