నందమూరి నటసింహం బాలకృష్ణ హ్యాట్రిక్ విజయంతో యమా దూకుడు మీద ఉన్నారు. సినిమా వెంట సినిమా చేసుకుంటూ.. తన సత్తా చాటుతున్నారు. అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి.. ఇలా మూడు వైవిధ్య సినిమాలతో ప్రేక్షకులను ఆకర్షించి, ఆనందింపజేసి సక్సెస్ కొట్టిన బాలయ్య.. ఇప్పుడు మరో ఊర మాస్ సినిమాను సిద్ధం చేస్తున్నారు. వాల్తేరు వీరయ్యతో సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చిన బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో బాలయ్య NBK109 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రీసెంట్‌గానే మొదలైంది. తాజాగా ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్లకు సంబంధించి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటారనేలా వార్తలు బయటికి వచ్చాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్య టాలీవుడ్‌లో బాగా వినిపిస్తున్న బ్యూటీ.. ఇందులో బాలయ్య సరసన ఛాన్స్ కొట్టేసిందనేలా టాక్ వినబడుతోంది. ఆ బ్యూటీ మరెవరో కాదు మీనాక్షి చౌదరి. ప్రస్తుతం మీనాక్షి చౌదరి టాలీవుడ్‌లో మహేష్ బాబు సరసన గుంటూరు కారం సినిమాలో నటిస్తోంది. గుంటూరు కారం సినిమా నిర్మాతలే బాలయ్య సినిమాకు కూడా నిర్మాతలు కావడంతో.. అందులో నటిస్తోన్న మీనాక్షిని బాలయ్య సినిమాకు ఫిక్స్ చేశారనేలా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి.
అలాగే వాల్తేరు వీరయ్యలో ఓ సాంగ్‌లో మెరిసిన ఊర్వశి రౌతేలాకు కూడా బాబీ ఇందులో ఓ పవర్ ఫుల్ పాత్రను సెట్ చేశాడని.. ప్రస్తుతం బాలయ్య, ఊర్వశిపైనే షూటింగ్ జరుగుతుందనేది తాజా అప్‌డేట్. వీరిద్దరూ కాకుండా.. ఓ సీనియర్ నటికి కూడా ఇందులో ఛాన్స్ ఉందని, ఆమె పేరు త్వరలోనే రివీల్ చేస్తారని కూడా అంటున్నారు. అయితే ఈ వార్తలన్నింటిపై చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.