డిసెంబర్ 1న విడుదలైన యానిమల్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా యూత్‌ని బాగా ఆకర్షిస్తోంది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఇప్పటికే చాలా చోట్ల రికార్డులు బద్దలయ్యాయి. ఈ వీకెండ్‌తో చాలా వరకు రికార్డులు తుడిచిపెట్టుకుపోతాయనడంలో ఆశ్చర్యమే లేదు. ఈ శుక్రవారం విడుదల కాబోతోన్న నాని, నితిన్ సినిమాల టాక్ కనుక తేడా కొడితే.. యానిమల్‌కు ఇంకో వారం పాటు తిరుగే ఉండదు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మొదట అనుకున్న హీరోయిన్ రష్మిక కాదని సందీప్ రెడ్డి వంగా చెబుతున్న వీడియో ఒకటి సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది.
యానిమల్‌లో రణ్‌బీర్ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శిస్తే.. రష్మిక మందన్నా కూడా బోల్డ్ సీన్లులో రెచ్చిపోయింది. సినిమా విడుదల తర్వాత రష్మిక సీన్ల గురించే అంతా చర్చించుకుంటున్నారు. అలాంటిది రష్మిక చేయాల్సిన పాత్రలో ముందుగా వేరే హీరోయిన్ అంటే.. కచ్చితంగా ఇంట్రెస్ట్‌గానే అనిపిస్తుంది. ఇంతకీ సందీప్ వంగా చెప్పిన హీరోయిన్ ఎవరని అనుకుంటున్నారా? ప్రియాంకా చోప్రా సోదరి పరిణితి చోప్రా.
ఈ సినిమాకు మొదట పరిణితి చోప్రాని సెలక్ట్ చేశాం. ఆమెకు కథ బాగా నచ్చింది.. ఆమె సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. కానీ చివరి నిమిషంలో ఆమెను మార్చాల్సి వచ్చింది. ఇంకా షూటింగ్ 10, 12 రోజుల్లో ప్రారంభం అవుతుందనే సమయంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. గీతాంజలి పాత్రలో పరిణితి ఫిట్ కాలేదు.. ఆ పాత్రకి ఉన్న ఇంపార్టెన్స్ కారణంగా పరిణితిని మార్చి రష్మికను ఎంపిక చేశాం. చివరి నిమిషంలో మేము తీసుకున్న నిర్ణయం కారణంగా ఆమె చాలా డిజప్పాయింట్ అయి ఉంటుంది. అందుకు ఆమెకు క్షమాపణలు తెలియజేస్తున్నాను.. అని సందీప్ రెడ్డి వంగా తన తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.