ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్న దుస్థితినే ఇప్పుడు బీఆర్ఎస్ ఎదుర్కొంటోంది. కష్టకాలంలో పార్టీని వదిలేసిన వారెవ్వరూ ఒకచోటే స్థిరంగా ఉండరు. ఇప్పుడదే రుజువవుతోంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓటమి పాలైనప్పుడు ఆ పార్టీలో చాలా మంది నేతలు బీఆర్ఎస్‌లోకి జంప్ అయ్యారు. ఇప్పుడు కూడా కొంతమంది నేతలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి జంపింగ్‌కు సిద్ధమవుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక్కసారి పవర్‌కు అలవాటుపడిన ప్రజాప్రతినిధులు అది లేకుండా ఉండటం చాలా కష్టం. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ రాజకీయం చాలా ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
వారికి స్వప్రయోజనాలే ముఖ్యం..
పవర్ ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారినప్పుడు రాజకీయ వలసలు కూడా జరగటం మామూలే కానీ ఇక్కడ కొంత ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఒకటుంది. పదేళ్ల పాటు ఒక పార్టీలో కొనసాగి.. పదవులు అనుభవించి.. ఓడిపోగానే.. గెలిచిన పార్టీలోకి జంప్ అవడం కాస్త విడ్డూరంగా అనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ నేతలకు స్వప్రయోజనాలే ముఖ్యం. నగరంలో అయితే పవర్ లేకుండా వారం కూడా మనగలిగే పరిస్థితి లేని నేతలే ఎక్కువని తెలుస్తోంది. పైగా.. ఈ సమయంలో కాంగ్రెస్‌లో చేరితే ఏమైనా మంత్రి పదవీ ఇస్తారేమోనంటూ కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ బడా నేతలకు టచ్‌లో ఉన్నట్లు సమాచారం.
ఒక్క సీటును కూడా దక్కించుకోలేకపోయిన కాంగ్రెస్..
కొందరైతే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పిలుస్తుందా? అని ఎదురు చూస్తున్నారట. తమకై తామే వెళితే విలువ ఉండదనుకుంటున్నారని సమాచారం. కొంతమంది మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేల బలం ఎక్కువగానే ఉందని.. ఈ సమయంలో పార్టీ ఎందుకు పిలుస్తుందని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలోని ఓ మాజీ మంత్రి కాంగ్రెస్ బడా నేతలకు టచ్‌లోకి వెళ్లినట్లు చర్చ జరుగుతుంది. హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఒక్కటంటే ఒక్క సీటును కూడా దక్కించుకోలేకపోయింది. ఈ క్రమంలోనే రాజధాని నుంచి ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలుంటే బాగుంటుందని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతల అభిప్రాయమట. లోక్‌సభ ఎన్నికలకు సైతం ఇది కలిసొస్తుందని భావిస్తున్నారట. మొత్తానికి వీరు ఆహ్వానించడమో.. వారు ఆగలేక జంప్ అవడమో ఏదో ఒకటి మరికొద్ది రోజుల్లోనే జరుగుతుందని టాక్.