బీజేపీకి నిన్నటి ఎన్నికలు ఓ కంటి నుంచి కన్నీరు తెప్పిస్తే.. మరోకంట పన్నీరు తెప్పించాయి. సంతోషం, దు:ఖం ఏకకాలంలో వచ్చాయి. ఓవైపు తెలంగాణలో బీజేపీ మెరుగుపడిందని సంతోష పడాలో లేదంటే కీలక నేతలంతా ఓటమి పాలయ్యారని బాధపడాలో తెలియని పరిస్థితి. అసలు నిన్న బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి ఏమయ్యారో కూడా తెలియని పరిస్థితి. ఆయన ఎక్కడా కనిపించిన పాపాన పోలేదు. వరుసబెట్టి బండి సంజయ్ మొదలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావులకు చుక్కెదురైంది. ఈ కీలక నేతలంతా ఓటమి పాలవడం ఆ పార్టీకి ఆశ్చర్యాన్ని కలిగించింది.
పార్టీ ఎలా పుంజుకున్నట్టు?
బీజేపీ బీభత్సంగా పుంజుకుంది. ఈసారి బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం అదే అనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా ఆ పార్టీ పడిపోయింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 10 సీట్లు కూడా గెలవలేకపోయింది. బీజేపీ 8 చోట్ల గెలిచింది. ఇక బీజేపీ నుంచి విజయం సాధించిన వారిలో నిర్మల్ – మహేశ్వర్ రెడ్డి.. ఆర్మూర్ – రాకేశ్ రెడ్డి.. ముథోల్ – రామారావు పటేల్..
నిజామాబాద్ అర్బన్ – ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా.. ఆదిలాబాద్ – పాయల్ శంకర్.. గోషామహల్ – రాజా సింగ్.. కామారెడ్డి – కాటిపల్లి వెంకటరమణారెడ్డి, సిర్పూర్ – పాల్వాయి హరీష్ విజయం సాధించారు. మరి కీలక నేతలంతా ఓడిపోయారు కదా? పార్టీ ఎలా పుంజుకున్నట్టు అనుకుంటున్నారా?
14శాతం ఓట్ షేర్..
2018అసెంబ్లీ ఎన్నికల్లో 7శాతం ఓట్లతో కేవలం ఒకే ఒక్క సీటును మాత్రమే బీజేపీ గెలుచుకుంది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లతో పాటు.. 14శాతం ఓట్ షేర్‌ను బీజేపీ సాధించింది.19 స్థానాల్లో రెండో స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు నిలిచారు. కేసీఆర్, రేవంత్ లను ఓడించి కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి వెంకటరమణరెడ్డి సంచలనం నమోదు చేశారు.
గోషామహాల్ నుంచి రాజాసింగ్ హ్యాట్రిక్ విజయం సాధించారు. పోటీచేసిన రెండు స్థానాల్లో ఈటల రాజేందర్ ఓడిపోయారు. భారీ తేడాతో దుబ్బాకలో సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందనరావు ఓడిపోయారు. కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గం అంబరుపేటలో సైతం బీజేపీ ఓటమి పాలైంది. లక్ష్మణ్ నియోజకవర్గం ముషీరాబాద్‌లోనూ బీజేపీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. మొత్తానికి సీట్లు ఎక్కువ గెలుచుకుని ఆనందపడాలో.. అగ్రనేతలంతా ఓటమి పాలైనందుకు బాధపడాలో తెలియని స్థితిలో టీబీజేపీ ఉంది.