బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురించి ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ఓటమి పాలయ్యాక కేసీఆర్ హాట్ టాపిక్‌గా మారారు. ఇప్పుడు శాసనసభలో బీఆర్ఎస్ తరుఫున విపక్ష నేతగా కేసీఆరే ఉంటారా? లేదంటే దానిని తన తనయుడు కేటీఆర్‌కో.. మేనల్లుడు హరీశ్ రావుకో అప్పగిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్ ఇప్పుడు తొలిసారిగా విపక్ష నేతగా బాధ్యతలు తీసుకుంటారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఉద్యమ సమయంలో తప్ప ఈ పార్టీ ఇప్పటి వరకూ విపక్ష పార్టీగా ఉన్నది లేదు.
తొలిసారిగా విపక్షంలో బీఆర్ఎస్
ఈ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ తమ పార్టీలోకి లాగేసింది. చివరకు కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసి తమ పార్టీలో కలుపుకోవాలని సైతం ప్లాన్ చేసింది. విపక్షాలను ఇబ్బంది పెట్టడమే కాకుండా రాజకీయ ఒత్తిడిని తీసుకొచ్చింది. ఇలాంటి బీఆర్ఎస్ తెలంగాణ వచ్చాక తొలిసారిగా విపక్షంలో కూర్చోనుంది. ఇప్పుడు బీఆర్ఎస్ చేసిన విధంగానే కాంగ్రెస్ పార్టీ సైతం ప్రయోగిస్తే ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్ భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లను ఎదుర్కోబోతోంది? దానికి సీఎం కేసీఆర్ ముందుండి ఫేస్ చేస్తారా? లేదా? అనే విషయమై సర్వత్రా చర్చ జరుగుతోంది.
బీజేపీ అధిష్టానం ఇకపై సైలెంట్‌గా ఉండబోదు..
ఇక ఇప్పుడు బీఆర్ఎస్ అడకత్తెరలో పోకచెక్క కానుంది. ఒకవైపు కాంగ్రెస్.. మరోవైపు బీజేపీ అధిష్టానం నుంచి రాజకీయ ఒత్తిళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ఒకప్పుడు అంటే.. బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి ఎక్కడ ఇండియా కూటమికి మద్దతు ఇస్తారోనని కాస్త బీజేపీ అధిష్టానం తగ్గి ఉందని.. లేదంటే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను ఎప్పుడో అరెస్ట్ చేసి ఉండేదనే టాక్ వినిపించింది. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రాభవం తగ్గింది కాబట్టి బీజేపీ అధిష్టానం ఇకపై సైలెంట్‌గా ఉండబోదు. మరోవైపు రేవంత్ సీఎం అయితే బీఆర్ఎస్‌ను విడిచిపెట్టరు. మొత్తమ్మీద బీఆర్ఎస్‌కు గడ్డు పరిస్థితులు ఎదురు కానున్నాయి. వీటన్నింటినీ కేసీఆర్ ఫేస్ చేయగలరా? అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఆ తరువాత లోక్‌సభ ఎన్నికల నాటికి బీఆర్ఎస్‌కు మరింత గట్టి పోటీ ఎదురు కానుంది.