ఇద్దరు సీఎం అభ్యర్థులను ఓడించి హాట్ టాపిక్‌గా కాటిపల్లి..
కాటిపల్లి వెంకటరమణారెడ్డి.. ఒక్కసారిగా 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితం తర్వాత ఆయన పేరు మార్మోగుతోంది. నిన్నటిదాకా కామారెడ్డి జిల్లా నేతగా ఉన్న ఆయన తెలంగాణకు పెద్దగా తెలియదు. కానీ ఒక్కసారిగా ఆయన దేశ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయారు. అప్పటి వరకూ ఉన్న సీఎంను.. కాబోయే సీఎంను ఓడించిన ఘనత ఆయనదే. కేసీఆర్, సీఎం అభ్యర్థి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రత్యర్థులుగా పోటీ పడిన కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి విజయం సాధించారు. కేసీఆర్ రెండో స్థానంలో.. రేవంత్ ఇక్కడ మూడో స్థానానికి పడిపోయారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ వెంకటరమణారెడ్డిదే హవా.
కేసీఆర్, రేవంత్ పోటీ చేస్తుండంతో అందరి దృష్టి కామారెడ్డిపైనే ఉండిపోయింది. ఇద్దరూ సీఎం అభ్యర్థులే కావడంతో కామారెడ్డి హాట్ టాపిక్‌గా నిలిచింది. చివరకు వాళ్లిద్దరూ కాకుండా కాటిపల్లి గెలవడం కూడా మరింత చర్చనీయాంశంగా మారింది. నేషనల్ మీడియా సైతం ఈ వార్తను ఆసక్తికరంగా టెలికాస్ట్ చేసింది. అయితే ఇక్కడ తొలుత రేవంత్ ఆధిక్యాన్ని కనబరిచారు. కేసీఆర్ మూడో స్థానంలో కొనసాగారు. చివరకు స్థానాలు పూర్తిగా మారిపోయాయి. 11వ రౌండ్ నుంచి కాంగ్రెస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ జరిగింది. 19వ రౌండ్ వచ్చేసరికి బీజేపీ ఆధిక్యం కొనసాగింది. మొత్తానికి కేసీఆర్, రేవంత్‌లను ఓడించి కాటిపల్లి గెలవడం అనేది జనం ఆసక్తికరంగా చెప్పుకుంటున్నారు.
ఆ విషయంలో కాటిపల్లి సక్సెస్..
2018 ఎన్నికల్లో కూడా కాటిపల్లి పోటీ చేశారు. కానీ దారుణంగా ఓడిపోయారు. కేవలం 15,439 ఓట్లు మాత్రమే వచ్చాయి. అలాంటి కాటిపల్లి ఇప్పుడు ఇద్దరు సీఎం అభ్యర్థులపై విజయం సాధిస్తారని ఎవరూ ఊహించలేదు. ముఖ్యంగా స్థానికుడు అన్న అంశమే ఆయన విజయానికి కారణమైంది. రేవంత్ కానీ, కేసీఆర్‌ను కానీ గెలిపిస్తే ఇద్దరూ నియోజకవర్గంలో ఉండరన్న విషయాన్ని జనంలోకి తీసుకెళ్లడంలో కాటిపల్లి సక్సెస్ అయ్యారు. దీనికి తోడు ప్రధాని మోదీ బహిరంగ సభ కూడా కలిసొచ్చింది. పైగా ప్రతి విషయంలోనూ స్థానికులకు కాటిపల్లి అండగా నిలిచారు. ప్రతి ొక్క వర్గానికి ఆయన చేరువయ్యారు. ఆసక్తికరంగా సొంత మానిఫెస్టోను సైతం ఆయన ప్రకటించారు.
2006లో తాడ్వాయి జడ్పీటీసీగా..
తాను గెలిచినా, లేకున్నా రూ.150 కోట్ల సొంత నిధులతో పలు అభివృద్ధి పనులు చేస్తానని.. మల్టీసూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు కట్టిస్తానని, మోడల్ స్కూళ్లు నిర్మిస్తానని, రైతు సేవ కేంద్రాలు, యువతకు ఉపాధి శిక్షణ కేంద్రాలు వంటివి ఏర్పాటు చేస్తానని మేనిఫెస్టోలో కాటిపల్లి ప్రకటించారు. మొత్తానికి కాటిపల్లికి మంచి విజయం వరించింది. ఇక కాటిపల్లికి విద్యాస్థంస్థలతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారాలున్నాయి. 2006లో కాంగ్రెస్ తరఫున తాడ్వాయి జడ్పీటీసీగా విజయం సాధించారు. ఆపై ఉమ్మడి నిజామాబాద్ జడ్పీ చైర్మన్‌గా చేశారు. వైఎస్ మరణానంతరం వైసీపీలో చేరారు. ఆ తరువాత తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. ఆపై బీజేపీలో చేరి ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలుపొందారు.