ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎగ్జాట్‌గా చెప్పాయ్.. తెలంగాణ కాంగ్రెస్‌దే..
తెలంగాణ ఎగ్జిట్ పోల్ ఫలితాలు అక్షరాలా నిజమని తేలింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అధికార పార్టీ బీఆర్ఎస్‌కి దారుణ పరాజయాన్ని మూటగట్టాయి. ఈ ఎన్నికల్లో హస్తం పార్టీ ఘన విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాల్లో విజయం సాధించి విజయదుందుభి మోగించింది. తెలంగాణ ఏర్పడ్డాక బీఆర్ఎస్‌కు ఇది తొలి ఓటమి. ఈసారి కూడా పక్కాగా బీఆర్‌ఎస్‌దే విజయమని.. తాను హ్యాట్రిక్ సీఎం అవుతానని కేసీఆర్ కలలు కన్నారు. కానీ అవి కాస్త కల్లలయ్యాయి.
ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ సహా పలువురు మంత్రులు పరాజయం పాలయ్యారు. కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డిలలో పోటీ చేయగా.. గజ్వేల్‌లో విజయం సాధించారు కానీ కామారెడ్డిలో ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలోనే ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కేసీఆర్ తన రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపారు. గవర్నర్ కూడా కేసీఆర్ రాజీనామాను ఆమోదించడం జరిగింది. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకూ కేసీఆరే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు.
మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి , కొప్పుల ఈశ్వర్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఓటమి పాలయ్యారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్‌లోకి జంప్ చేసిన నేతలంతా ఈ ఎన్నికల్లో ఎదురీదాల్సి వచ్చింది. ఎమ్మెల్యే కొనుగోలు కేసులో ఉన్న నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి.బీరం హర్షవర్ధన్ రెడ్డి.రేగా కాంతారావు, గువ్వల బాలరాజు ఓటమి పాలయ్యారు.