తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ డిసెంబర్ 3 ఆదివారం ఉదయం మొదలయ్యింది. ప్రస్తుతం కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల హవా సాగుతోంది. అధికార బీఆర్‌ఎస్ ఆధిక్యం తగ్గుతూ వస్తోంది. బీజేపీ 8 చోట్ల ఆధిక్యం కనబరుస్తోంటే.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగిన జనసేన జాడ అస్సలు కనిపించకుండా పోయింది. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగింది.
పవన్ కళ్యాణ్ మోడీ తో కలిసి ప్రచారం చెయ్యడమే కాకుండా కూకట్ పల్లిలో రోడ్ షో నిర్వహించగా.. భారీ ఎత్తున జనాలు తరలి రావడంతో ఈ నియోజక వర్గంలో జనసేన అభ్యర్థి పక్కాగా గెలుస్తాడని అనుకున్నారు. కానీ ఆ నియోజకవర్గంలో 5 రౌండ్లు ముగిసే సరికి జనసేన అభ్యర్థి వెనుకబడి మూడో స్థానంలో కొనసాగుతున్నారు. అయితే బీజేపీతో పొత్తుతో మొత్తం 8 స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేసింది. కౌంటింగ్ ప్రారంభమై పలు రౌండ్లు ముగిసినా ఆ పార్టీ అభ్యర్థులు ఒక్క చోట కూడా ప్రభావం చూపించలేకపోతున్నారు. పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్వయంగా ప్రచారం చేసి తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అయినా ఓటర్లు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.
పవన్ కళ్యాణ్ ని సినిమాల్లో సపోర్ట్ చేసే అభిమానులు రాజకీయాల్లో చేయరు అని మరోమారు తేలిపోయింది. తెలంగాణ ఎన్నికల్లో జనసేన ఎలాంటి ప్రభావం చూపలేక మూగబోయింది.