తెలంగాణలో గులాబీ బాస్ కేసీఆర్ అంటే... ఆయనొక అపర చాణక్యుడు.. జనబలం మెండుగా కలిగిన నేత.. తెలంగాణ ఉద్యమ సారధి.. తెలంగాణను తెచ్చిన ఘనుడు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి నేటి వరకూ బీఆర్ఎస్ పార్టీని ఎలాంటి కష్టం లేకుండా నడిపించిన వ్యక్తి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్ని సార్లు సవాళ్లకు తలొగ్గి తనతో పాటు తన పార్టీ నేతలతో రిజైన్ చేయించి తిరిగి పోటీ చేసి విజయం దిశగా నడిపించిన వ్యక్తి. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా రెండు పర్యాయాలు తన పార్టీని విజయపథంలో నడిపించారు. ఇప్పుడు జనం మార్పు కోరుకుంటున్నారు. పోనీ తెలంగాణను ఆయనేమైనా అభివృద్ధి చేయలేదా? అంటే గణనీయమైన అభివృద్ధి చేశారు.
పెద్దగా పరిజ్ఞానం ఉన్నవారు లేరా?
సైబరాబాద్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు నిర్మిస్తే.. దానిని ప్రపంచ స్థాయి గుర్తింపునిచ్చిన ఘనత కేసీఆర్‌దే అనడంలో సందేహం లేదు. ఒక్క ఐటీలోనే కాదు.. ఇతర రంగాల్లోనూ గణనీయమైన అభివృద్ధి చేశారు. పోనీ ఆయన వెంట పెద్దగా పరిజ్ఞానం ఉన్నవారు లేరా? అంటే.. ఆయన వెంట అతిమహారథులని చెప్పుకోదగిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. అలాంటి కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో ఎదురీదుతున్నారంటే.. ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి పరిస్థితేంటని సర్వత్రా చర్చ నడుస్తోంది. ఏపీలో జగన్ సీఎం అయ్యాక ఆ రాష్ట్రం అభివృద్ధి ఊసే ఎరుగదు. కేవలం సంక్షేమాన్ని మాత్రం నమ్ముకున్నారు. మరి కేసీఆర్ సంక్షేమంపై ఫోకస్ పెట్టలేదా? ఆ విషయంలోనూ దిట్టే.
శంకుస్థాపనలు తప్ప నిర్మాణాలు శూన్యం..
వైసీపీ సంక్షేమ పథకాలు చెప్పుకోదగినంత గొప్పవేం కాదు. శంకుస్థాపనలు తప్ప నిర్మాణాలు శూన్యం. పోలవరాన్ని మంటగలిపారు. ప్రత్యేక హోదా నిల్. పైగా రాజధాని లేని రాష్ట్రాన్ని చేశారు. నోటిఫికేషన్లు ఒక్కటీ లేవు. ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు పడతాయో తెలియదు. పరిశ్రమలన్నింటినీ తరిమికొట్టింది వైసీపీ ప్రభుత్వం. రుషికొండను పూర్తిగా తొలిచేసింది. హైదరాబాద్‌లో కేబుల్ బ్రిడ్జి గురించి గొప్పగా చెబుతుంటే.. ఏపీలో తాళ్లతో బ్రిడ్జిని ఏర్పాటు చేసి హంగామా చేసింది. బీభత్సమైన అభివృద్ధి చేసిన కేసీఆర్‌కే ఈ ఎన్నికల్లో తిప్పలు తప్పడం లేదు. అలాంటిది.. సీఎం జగన్ పరిస్థితి ఏంటి? ఏపీ ఆర్ధిక, పారిశ్రామిక, మౌలిక, తదితర అన్ని రంగాలలో అభివృద్ధి జరిగిపోతోందని గ్రాఫిక్స్ చూపిస్తే నమ్మడానికి జనం పిచ్చోళ్లా? ఈసారి జగన్‌కు జనం చుక్కలు చూపించడం ఖాయమని టాక్ నడుస్తోంది.