పరాయిగడ్డపై పరువు తీసిన వైసీపీ నేత.. పార్టీ స్పందన చూస్తే..
తాను చేస్తే సంసారం.. ఎదుటి వ్యక్తి చేస్తే వ్యభిచారం అన్నట్టుగా ఉంటుంది వైసీపీ వ్యవహారం. హ్యుమన్ ట్రాఫికింగ్‌లో వైసీపీ నేత అమెరికాలో అడ్డంగా దొరికిపోతే.. తప్పు ఎవరు చేసినా తప్పేనంటూ అప్పటి టీడీపీ హయాంలో ఏదో జరిగిందంటూ వాటన్నింటినీ తిరగదోడుతోంది. అంటే.. ఇప్పుడు నీ పార్టీ నేత తప్పు చేస్తే వెనుకేసుకొస్తున్నట్టే కదా? వాళ్లు చేశారు సరే.. నీ పార్టీ నేతను నువ్వేమైనా సస్పెండ్ చేశావా? లేదే.. పైగా తమ పార్టీ నేత కాదంటూ స్టేట్‌మెంట్లు. వారెవ్వా.. అప్పట్లో స్వయంగా జగన్ పదవి ఇచ్చిన విషయాన్ని కప్పిపుచ్చితే దాగుతుందా? జగన్‌తో దిగిన ఫోటలు మాయం చేస్తే మాయమవుతాయా? తప్పు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి టీడీపీ నేతలెవరూ చేయలేదా? అనడమేంటి?
అసలు ఏం జరిగిందంటే..
వైసీపీ లీగల్ కోఆర్డినేటర్‌గా చెప్పుకుంటున్న సత్తారు వెంకటేష్ రెడ్డి అమెరికాలో హ్యుమన్ ట్రాఫికింగ్ చేస్తూ అక్కడి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. 20 ఏళ్ల తెలుగు రాష్ట్రానికి చెందిన యువకుడిని చదువు పేరుతో అమెరికా తీసుకెళ్లి అక్కడ తన ఇంట్లో వెట్టి చాకిరి చేయించుకుంటున్నాడు వెంకటేష్ రెడ్డి. అంతటితో ఆగాడా? మాట వినకుంటే ఇష్టానుసారంగా కొట్టడం.. రోజుకు కనీసం మూడు గంటలు కూడా నిద్ర పోనివ్వకుండా పని చేయించుకోవడం వంటివి చేశాడు. చిత్ర హింసలకు గురైన సదరు యువకుడు బాగా వీక్ అయిపోయాడు. అతని పరిస్థితిని చూసిన చుట్టుపక్కలవారు చలించిపోయారు. అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రియాక్ట్ అయిన అమెరికా పోలీసులు బాధితుడిని హాస్పిటల్‌లో చేర్చి.. వెంకటేష్ రెడ్డిపై అమెరికాలో మానవ అక్రమరవాణా, బానిసత్వం, హింసకు పాల్పడటం వంటి కేసులు పెట్టారు.
సీఎం జగన్ బంధువట...
సెయింట్ చార్లెస్ కౌంటీలో ఉంటున్న వెంకటేష్ తొలుత తన నివాసంలోకి పోలీసులను రానివ్వలేదట. బలవంతా పోలీసులు లోపలికి వెళ్లి చూస్తే.. సదరు యువకుడు దయనీయ స్థితిలో ఉన్నాడట. ఏపీలోని పల్నాడు జిల్లా వినకొండకు చెందిన సత్తారు వెంకటేష్ రెడ్డి తాను వైసీపీ నేతనని.. సీఎం జగన్ బంధువునని చెప్పుకుంటూ ఉంటాడు. వైఎస్సార్ ఆసరా ఫౌండేషన్ కో-ఫౌండర్, వైసీపీ లీగల్ సెల్ స్టేట్ కోఆర్డినేటర్ అని అతని సోషల్ మీడియాలో రాసుకున్నాడు. జగన్‌తో తీసుకున్న పిక్స్ కూడా ఉన్నాయి. కానీ వైసీపీ వాళ్లు ఈ వ్యవహారంపై మరోలా స్పందిస్తున్నారు. టీడీపీ వాళ్లు గురివింద గింజ మాదిరి మాట్లాడుతున్నారని.. ఆ పార్టీ నేతలు తప్పు చేయలేదా? అంటూ లిస్ట్ తీస్తున్నారు. అంటే తమ పార్టీ నేత తప్పు చేశాడని ఒప్పుకున్నట్టే కదా? దీనిపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చే నడుస్తోంది.