అక్కడ మదర్.. ఇక్కడ ఫ్రెండ్.. మిగతాది అంతా సేమ్ టు సేమ్. అవును సలార్ ట్రైలర్ చూసిన తర్వాత అందరూ వ్యక్తం చేస్తున్న అభిప్రాయమిదే. కెజియఫ్‌లో తల్లికి ఇచ్చిన మాట కోసం.. ఒక సామ్రాజ్యాన్ని శాసిస్తే.. ఇక్కడ ఫ్రెండ్ కోరాడని ఓ సామ్రాజ్యాన్ని ఇవ్వడం కోసం ఎగేసుకుని వెళ్లిపోతున్నట్లుగా ప్రభాస్‌ని చూపించారు. కెజియఫ్ వంటి సినిమా తెలుగు హీరోకి పడుంటేనా? అని ఆ సినిమా విడుదల టైమ్‌లో చాలా మంది ప్రేక్షకులు అనుకున్నారు. వారి కోరిక తీరేలా సలార్ ఉంటుందని, అలాగే ప్రభాస్‌ని యష్ ప్లేస్‌లో ఊహించుకుని కెజియఫ్ చూస్తే ఎలా ఉంటుందో అలాగే సలార్ ఉండబోతుందనేది సలార్ ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి వినిపిస్తున్న మాట.
ఎందుకంటే కెజియఫ్, సలార్‌లో సేమ్ టు సేమ్ అనేలా చాలా పోలికలు కనిపిస్తున్నాయి. విలన్ కోటలోకి ఎవరూ రాకూడనే ఆంక్షలు, ఒక పిల్లాడు (హీరో) చాలా గంభీరమైన కంఠంతో మాట్లాడటం, హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత లేకుండా కూర్చోబెట్టడం, విలన్లు కనిపించిన తీరు, గుడిసెలు, మిలటరీ వెహికల్స్‌తో నిండిన ఇండస్ట్రీయల్ ఏరియా ఇలా చాలా పోలికలు ఈ ట్రైలర్‌లో గమనించవచ్చు. అంతే కాదు, యాక్షన్ కూడా దాదాపు ఒకేలా ఉండటం కూడా మరో కెజియఫ్ అని మాట్లాడుకునేలా చేస్తుందీ సలార్ ట్రైలర్. ఇంకొందరైతే.. అసలీ సినిమాలో హీరో ప్రభాసా.. పృథ్వీరాజా? అని కూడా డౌట్స్ వ్యక్తం చేస్తుండటం విశేషం.
మొత్తంగా ట్రైలర్ గురించి చెప్పుకోవాలంటే.. తెలుగు హీరో కెజియఫ్ సినిమా చేస్తే ఎలా ఉంటుందనేది సలార్‌లో చూడబోతున్నాం అనేలా టాక్ వినబడుతోంది. ట్రైలర్‌లో ప్రభాస్ కనిపించేది కాసేపే అయినా.. ఫ్యాన్స్‌కి మాత్రం పూనకాలు తెప్పించాడు. ఇది మాత్రం నిజం. ఇక డిసెంబర్ 22న థియేటర్లలో నల్లటి మసి కమ్ముకోవడం కాయం.