తెలంగాణ దంగల్‌లో భాగంగా కీలక అధ్యాయం ముగిసింది. ఇక అందరూ డిసెంబర్ 3 ఎప్పుడు వస్తుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక పోటీ చేసిన అభ్యర్థులకైతే ఈ రెండు రోజులు నిద్ర పట్టడం కూడా కష్టమే. నిన్న మొన్నటి వరకూ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం.. రికార్డ్ పక్కా.. రాసి పెట్టుకోండంటూ సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున సవాళ్లు విసిరారు. కట్ చేస్తే సీన్ మొత్తం రివర్స్ అయ్యేలా కనిపిస్తోంది. సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీకే అధికారాన్ని కట్టబెట్టనున్నాయి. నిన్న పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయి. సుమారు 20కి పైగా రాష్ట్ర, జాతీయ ప్రముఖ మీడియా సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌ను వెల్లడించిన విషయం తెలిసిందే.
మేకపోతు గాంభీర్యం..
వాటిలో ఒకటి అర మినహా అన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని తేల్చాయి. నిజానికి సీఎం కేసీఆర్ అంతర్గత సర్వేలన్నీ కూడా అదే విషయాన్ని తేల్చినట్టు టాక్. కాకపోతే మేకపోతు గాంభీర్యం అయితే ఆ పార్టీ ప్రదర్శించింది. అయితే ఎక్కడో గులాబీ నేతల్లో ఉన్న చిన్న ఆశ సైతం నిన్న సాయంత్రంతో పోయి ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో అయితే బీఆర్ఎస్‌పై మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. అప్పుడే కేసీఆర్ కుటుంబం తట్టా బుట్టా సర్దుకుని ప్రగతి భవన్‌ని వదిలి వెళుతున్నట్టుగా పిక్స్ పెట్టి మీమ్స్ వెల్లువెత్తిస్తున్నారు. కారు.. సారూ.. రారు అంటూ సోషల్ మీడియాలో ఊదరగొట్టేస్తున్నారు. మొత్తానికి ఎగ్జిట్ పోల్ ఫలితాలైతే గులాబీ బాస్‌ను తీవ్ర ఆవేదనలో ముంచెత్తాయట.
రైతుబంధు అందకపోవడం దెబ్బే..
ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఎందుకొచ్చిందనే విషయమై గులాబీ బాస్ కేసీఆర్ ఆరాలు మొదలు పెట్టేశారట. తమపై అనుకున్నంత వ్యతిరేకత లేదని భావించిన కల్వకుంట్ల కుటుంబం ఇప్పుడు ఏదో నిశ్శబ్ద యుద్ధం జరిగిందని ఫీలవుతున్నారట. నిరుద్యోగులు, ఉద్యోగులు బీఆర్ఎస్‌పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. వారి దెబ్బ బీఆర్ఎస్ పార్టీకి ఈసారి గట్టిగానే తగులుతుందని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు. మరోవైపు కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోతారని కూడా అంటున్నారు. అక్కడ బీజేపీ గెలిచే అవకాశాలు ఎక్కువని టాక్. ఇక ఆఖరి నిమిషంలో రైతుబంధు అందకపోవడం కూడా బీఆర్ఎస్‌కు దెబ్బేసిందని సమాచారం. ఎగ్జిట్ పోల్ ఫలితాలు తప్పవుతాయని మంత్రి కేటీఆర్ ఇప్పటికీ చెబుతున్నారు. కానీ నిన్న పోలింగ్ మొత్తం వన్ సైడెడ్‌గా జరిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక చూడాలి ఏం జరగనుందో..