ఎదుటి వ్యక్తి కొండంత చేసినా విషయానికి వస్తే విమర్శలు.. తాము రవ్వంత చేసినా గొప్పలు చెప్పుకునే వారు కొందరుంటారు. వైసీపీ ఏం చేసినా దాని వెనుక పరమార్థం మరొకటి ఉంటుంది. పైకి మాత్రం తామేదో సంఘ సేవ చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ ఉంటారు. వీరి సంఘ సేవ గురించి అందరికీ తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు ఒక పరిపాలనా దక్షుడు అనడంలో సందేహం లేదు. హైదరాబాద్ ఇంతలా అభివృద్ధి చెందడం వెనుక ఆయన పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సైబరాబాద్ వంటి మహానగరాన్ని నిర్మించిన వ్యక్తిగా ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతారు. మంత్రి కేటీఆర్ సైతం ఎన్నో సార్లు చంద్రబాబు గురించి ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
ఆడుదాం ఆంధ్రా పేరిట ఆటల పోటీలు..
అలాంటి చంద్రబాబు గురించి కూడా వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. చంద్రబాబును పూచిక పుల్ల కింద తీసిపారేస్తారు. ఇలాంటి వైసీపీ నేతలు తాజాగా ఓ మంచి పని చేశారు. “ఆడుదాం ఆంధ్రా” పేరుతో రాష్ట్రంలో క్రీడా పోటీలు నిర్వహించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం జగన్‌కు ఇలాంటి ఆలోచన రావడం నిజంగా అద్భుతం. కానీ ప్రశంసించే లోపే దాని వెనుక గుట్టు బయటపడింది. రాష్ట్రంలో నిర్వహించే ఏ కార్యక్రమమైనా తన రాజకీయ అవసరానికి ఉపయోగపడేలా రూపొందిస్తారనేది జగన్ మరోసారి నిరూపించుకున్నారు. క్రీడాకారులకు అవసరమైన సామాగ్రినంతా తామే సప్లై చేస్తున్నామని తెలిపింది. క్రీడాకారులంతా ఫుల్ హ్యాపీ.
శ్మశానాలకు వైసీపీ రంగులేసిన వారికి ఇదో లెక్కా?
అయితే ఆ క్రీడా సామాగ్రి వచ్చిన తర్వాత చూసి అంతా షాక్ అయ్యారు. క్రీడా సామాగ్రి మొదలు.. ఆటలో గెలిచిన వారికి ఇచ్చే పథకాల వరకూ జగన్ చిత్రాలను ముద్రించారు. ఇందులో విశేషమేముంది? శ్మశానాలకు వైసీపీ రంగులేసిన వారికి ఇదో లెక్కా అంటారా? నిజమే కానీ ఆటలు నిర్వహిస్తామని ఆర్భాటంగా ప్రకటించి ఇలా ప్రచారం చేసుకుంటారని ఎవరూ ఊహించలేదు. పిల్లలు తాగే పాల ప్యాకెట్లను వదలని వారు ఇలాంటి అవకాశాన్ని వదులుతారా? అని అంతా అనుకుంటున్నారు. స్కూలు కిట్స్‌పై కూడా ఇదే విధంగా ప్రభుత్వం సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటోంది. చివరకుపిల్లలకు ఇచ్చే చిక్కి మీద కూడా జగన్ ఫోటోను ముంద్రించారు. అంతెందుకు.. తిరుమలలో చిరుతలను తరిమేందుకు ఇచ్చిన కర్రలపై కూడా జగన్ బొమ్మలను ముద్రించారు. ఇవన్నీ చూసి పిచ్చి పరాకాష్టకు చేరడమంటే ఇదేనేమో అని అంతా అనుకుంటున్నారు.