తెలంగాణ ఎన్నికలపై రూ.2500 కోట్లు దాటిన బెట్టింగ్‌లు..
క్రికెట్, ఎన్నికలు అనగానే బెట్టింగ్‌లు సర్వసాధారణం. తెలంగాణ ఎన్నికలపై పెద్ద ఎత్తున బెట్టింగ్ నడుస్తోంది. అయితే గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో బెట్టింగ్ హవా పెద్దగా లేదనే చెప్పాలి. అయినప్పటికీ ఇప్పటికే రూ. 2,500 కోట్లకుపైగా దాందా సాగినట్లు సమాచారం. ఇంకా కౌంటింగ్‌కు డిసెంబర్ 3 వరకూ సమయం ఉంది. అప్పటి వరకూ బెట్టింగ్ బీభత్సంగా సాగనుంది. ఈ దందా నెల రోజులుగా జరుగుతోందని టాక్. నెల క్రితమే ఎన్నికలపై రూ.1000 కోట్ల వరకూ బెట్టింగులు జరిగాయని ప్రచారం జరిగింది. హైదరాబాద్ లేదా తెలంగాణలో బెట్టింగ్ నిర్వహిస్తే పట్టుబడే అవకాశం ఉంది. దీంతో బుకీలు చాలా తెలివిగా వేరే రాష్ట్రాల నుంచి దందా సాగిస్తున్నట్టు తెలుస్తోంది.
పక్కనున్న ఏపీ సహా దేశంలోని పలు ప్రాంతాల నుంచి తెలంగాణపై బెట్టింగ్ దందా నడుస్తోందట. ముఖ్యంగా ఒక పార్టీ గెలుపుపై పెద్ద ఎత్తున పందేలు పెడుతున్నారట.
ఏపీ, ముంబై, ఢిల్లీ, కోల్‌కతతోపాటు దేశంలోని పలు ఇతర నగరాల నుంచి ఇది జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొందరు బుకీలు లండన్, అమెరికాల నుంచి యాప్‌ల ద్వారా బెట్టింగులు నిర్వహిస్తున్నట్లు తెలియవచ్చింది. ముఖ్యంగా ఒక పార్టీ గెలుపుపై రెట్టింపు పందేలు జరుగుతున్నాయి. కౌంటింగ్ రోజు వరకూ బెట్టింగ్‌లు ఏ స్థాయికి చేరుకుంటాయోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇక ఏ పార్టీపై పెద్ద ఎత్తున బెట్టింగ్ సాగుతోందనేది మాత్రం తెలియరాలేదు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధమైంది. నిన్న సాయంత్రం నుంచే రాష్ట్రంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. మరోవైపు బీఆర్ఎస్ నేడు దీక్షా దివస్ నిర్వహించాలని భావించింది కానీ దీనికి ఈసీ అనుమతి నిరాకరించింది. ఎన్నికల విధుల్లో భాగంగా కేంద్ర బలగాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలపై అధికారులు మరింత ఫోకస్ పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,655 ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.