తెలంగాణ ఎన్నికలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మరికొన్ని గంటల్లో అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. ఏ పార్టీ ఈసారి విజయం సాధిస్తుందనేది పెద్దగా ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఎప్పుడూ ఎన్నికలు వస్తున్నాయంటే పెద్ద ఎత్తున బెట్టింగులు నడిచేవి. ఈసారి మాత్రం పెద్దగా బెట్టింగులు నడుస్తున్నట్టుగా కనిపించడం లేదు. అసలు ఏ పార్టీ గెలుస్తుందనేది ఎవరికీ క్లారిటీ లేకపోవడంతో బెట్టింగులకు ఆసక్తి చూపడం లేదు. ఇదిలా ఉంటే.. ముఖ్యంగా కొందరి పరిస్థితి మాత్రం ఇబ్బందికరంగానే ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యంగా జంప్ జిలానీలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వారికి తమ నియోజకవర్గాల్లో ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతోంది.
2018లో కాంగ్రెస్, టీడీపీ నుంచి 14 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కారెక్కేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం వీరిలో 13 మందికి టికెట్లు ఇచ్చింది. వీళ్లందరికీ ప్రస్తుతం ముప్పు పొంచి ఉంది. వీరి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. కాంగ్రెస్ అభ్యర్థులు ఈసారి విజయం కోసం శతవిధాలుగా యత్నించారు. దీంతో జంపింగ్స్‌కి చుక్కలు కనిపిస్తున్నాయి. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 19 మంది ఎమ్మెల్యేలుగా గెలవగా.. వారిలో 12 మంది బీఆర్ఎస్ పంచన చేరారు. ఇది జనాల్లో బాగా నాటుకుపోయింది. ఓటేసి గెలిపించిన తాము పిచ్చోళ్లని చేశారనే భావన జనాల్లో ఉంది. దీంతో వారిపై జనాల్లో వ్యతిరేకత ఉంది.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలపడటంతో పాటు ప్యాకేజీల కోసం కారెక్కారన్న భావన జనాల్లోనూ ఉండటంతో ఈసారి జంపింగ్స్ గడ్డు పరిస్థితులను అయితే ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్‌లోకి జంప్ అయిన వాళ్లు ఎక్కువ ఖమ్మం జిల్లా నుంచే ఉన్నారు. గత ఎన్నికల్లో అయితే కేవలం పువ్వాడ అజయ్ మాత్రమే బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించారు.ఖమ్మం జిల్లాలోని 10 స్థానాల్లో ఒక్కటి మినహా తొమ్మిది స్థానాల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. ఈ సారి అయితే ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నుంచి ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు దాటనివ్వబోమని అప్పట్లోనే పార్టీ కీలక నేతలు శపథం చేశారు. ఇప్పుడు అక్కడి పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆసక్తి నెలకొంది. మొత్తానికి అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని సమాచారం. మొత్తానికి జంపింగ్స్ పరిస్థితి ఏం కానుందో చూడాలి.