అరేయ్ ఫూల్స్.. ఇక మొదలెడదామా?.. దుమ్ముదులిపిన నారా లోకేష్..
గతంలో మాదిరిగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉంటే ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ఆయన రాజకీయాల పరంగా ఎంతో పరిణతి చెందారు. ఇప్పుడు తండ్రికి ధీటుగా మాట్లాడుతున్నారు. ఎక్కడ ఏ ప్రశ్న తలెత్తినా కూడా తడుముకోకుండా పర్ఫెక్ట్ ఆన్సర్ చేస్తున్నారు. ఇక తాజాగా ఆయన యువగళం పాదయాత్రను పున: ప్రారంభించారు. చిత్తూరులో మొదలైన లోకేష్ యువగళం పాదయాత్రను 70 రోజుల అనంతరం తన తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో విరామం ఇచ్చారు. ఇక ఇప్పుడు ఆయన ఎక్కడైతే పాదయాత్రకు విరామం ప్రకటించారో.. అక్కడి నుంచే తిరిగి ప్రారంభించారు.
తాడేపల్లిలో టీవీ పగలడం ఖాయం..
నారా లోకేష్ యువగళం 2.0 పాదయాత్రకు టీడీపీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు అందుతోంది. నిన్నటి నుంచి ఆయన పాదయాత్ర పున:ప్రారంభమైంది. నిన్న జరిగిన సభలో లోకేష్ మాట్లాడుతూ.. సభకు హాజరైన టీడీపీ – జనసేన నాయకులకు ముందుగా ధన్యవాదాలు తెలిపారు. ఒక సైకో తీసుకున్న నిర్ణయం వలన తాత్కాలికంగా నిలిపివేసిన యువగళం కార్యక్రమానికి ముందుగా ప్రజలకు క్షమాపణలు అంటూ ప్రసంగాన్ని మొదలు పెట్టారు. అరేయ్ ఫూల్స్.. ఇక మొదలెడదామా? అంటూ లోకేష్ పంచ్ డైలాగ్స్‌తో అదరగొట్టేశారు. ఇన్ని రోజుల పాటు అంతో ఇంతో స్తబ్దుగా ఉన్న కేడర్‌లో నూతనోత్సాహాన్ని తీసుకొచ్చారు. యువగళం పాదయాత్రకు పెద్ద ఎత్తున జనం రావడంపై కూడా వైసీపీ అధినేత జగన్‌కు సెటైర్ వేశారు. యవగళానికి వచ్చిన జనసందోహాన్ని చూసి తాడేపల్లి కొంపలో టీవీ పగటడం ఖాయమంటూ జగన్‌ను ఉద్దేశించి పంచ్ వేశారు.
సాగనిస్తే యువగళం.. ఆపేస్తే దండయాత్ర..
నారా లోకేష్ తన ప్రసంగంలో ఎక్కడా తగ్గలేదు. అధికార పార్టీకి ప్రసంగిస్తున్నంత సేపూ పంచులతో వడ్డిస్తూనే ఉన్నారు. సజావుగా సాగనిస్తే యువగళం అని.. ఆపాలని చూస్తే దండయాత్ర అంటూ సవాళ్లు విసిరారు. జనసేన పార్టీ నుంచి గెలిచి ఆ పార్టీకి హ్యాండ్ ఇచ్చి వైసీపీ పంచన చేరిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ను వదల్లేదు. ఆయన అక్రమాలన్నింటినీ వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ ప్రభుత్వం పెడుతున్న ఆంక్షలపై నారా లోకేష్ ఫైర్ అయ్యారు. టీడీపీకి సంక్షోభాలు కొత్తేం కాదని.. ఆది నుంచి ఎదుర్కొంటూనే ఇక్కడి వరకూ వచ్చిందని లోకేష్ గుర్తు చేశారు. మూడు నెలల్లో వైసీపీ పాలన నుంచి విముక్తి దొరుకుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఓటమి ఖాయమని.. అప్పుడు లోటస్ పాండ్, బెంగుళూరు ప్యాలెస్.. తాడేపల్లి ప్యాలెస్..లేదంటే లండన్ పిచ్చాసుపత్రిలోనో ఆయన సేద తీరవచ్చని లోకేష్ ఎద్దేవా చేశారు. మొత్తానికి యువగళం పాదయాత్రతో తిరిగి టీడీపీ క్యాడర్‌లో ఫుల్ జోష్ నింపారు.