తెలంగాణలో ఎన్నికలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ తరుణంలో కేసీఆర్ సర్కారుకు ఊహించని షాక్ తగిలింది. రైతుబంధుకు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి నిరాకరించింది. ఇచ్చినట్టే ఇచ్చి అనడం కన్నా.. ఈసీ ఇచ్చిన అనుమతిని కేసీఆర్ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేకపోయింది అనడం సబబు. చివరి రోజు వరకూ ఆగి ఇవాళ రైతుల ఖాతాలో డబ్బులు జమచేయాలని ప్రభుత్వం భావించినట్టుంది. ఈలోపు విపక్షాలు ఊరుకుంటాయా? ఈసీకి ఫిర్యాదు చేశాయి. అంతే.. రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఈసీ వెనక్కి తీసేసుకుంది. ఈ నెల 24 నుంచి రైతుబంధు అనుమతికి ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది. అయితే సీఈసీ నిబంధనలు ఉలంగించినందుకు అనుమతిని రద్దు చేసింది.
డీఏ పంపిణీకి బ్రేక్..
నిజానికి ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పంపిణీ విషయంలో కూడా కేసీఆర్ సర్కార్ ఈ విధంగానే తాత్సారం చేసింది. మొత్తానికి అసలుకే ఎసరొచ్చింది. ఎన్నికలకు ముందు డీఏ విడుదల చేస్తే.. ఉద్యోగుల్లో పేరుకుపోయిన వ్యతిరేకతను కొంతమేరైనా తగ్గించుకోవచ్చని కేసీఆర్ భావించినట్టున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికలకు ముందు డీఏ ఇవ్వాలనుకున్నారు. కానీ ఈలోపే కోడ్ రావడం.. డీఏ పంపిణీకి బ్రేక్ పడటం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు రైతు బంధు విషయంలోనూ అదే జరిగింది. 24 నుంచి రైతుబంధు పంపిణీకి ఈసీ అనుమతిస్తే వెంటనే పంపిణీ చేయకుండా చివరి రోజున పంపిణీ చేయాలని ఆగిపోయింది. అలాగైతే రైతులకు గట్టిగా గుర్తుంటుందని భావించినట్టుంది. మొత్తానికే వేయకుండా అయిపోయింది.
24వ తేదీన అయినా జమ చేయవచ్చు కానీ...
రైతుబంధు పంపిణీకి ఈసీ షరతులు విధించింది. నగదు సాయానికి అనుమతి ఇస్తూనే సీఈసీ షరతులు విధించింది. ఎన్నికల ప్రచారం ముగిశాక పంపిణీ చేయొద్దని స్పష్టం చేసింది. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందు అంటే, ఈ నెల 28తో ప్రచార ఘట్టం ముగుస్తుంది. అయితే ఈ నెల 25, 26, 27 తేదీల్లో బ్యాంకులకు సెలవులు. 29, 30 తేదీల్లో పంపిణీకి అనుమతి లేదని ఈసీ ముందుగానే తెలిపింది. అయితే బ్యాంకులకు సెలవు కారణంగా రైతుబంధును డీబీటీ పద్ధతిలో జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. అది కూడా చేయలేదు. పోనీ 24వ తేదీన అయినా జమ చేయవచ్చు. అది కూడా చేయలేదు. ఈసారి పోడు భూముల రైతులకూ బంధు వర్తింపజేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. మొత్తంగా యాసంగి సీజన్‌లో 70 లక్షల మంది రైతులు లబ్ధి పొందాల్సి ఉంది.