తెలంగాణ ఎన్నికల నుంచి వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ నేర్చుకోగలిగితే చాలా ఉంది. చాలా పెద్ద గుణపాఠమే నేర్చుకోవచ్చు కానీ జగన్‌కు ఇవన్నీ ఎక్కుతాయా? అనేది సందేహంగా మారింది. ఏపీ శాసనసభ ఎన్నికలకు ముందు జరుగుతున్న తెలంగాణ ఎన్నికలను వైసీపీ కూడా నిశితంగానే పరిశీలిస్తోంది. నిజానికి తెలంగాణను కేసీఆర్ అధికారంలోకి వచ్చాక చాలా అభివృద్ధి చేశారు. ఎన్నో పరిశ్రమలను తీసుకొచ్చారు. ఐటీ కంపెనీలొచ్చాయి. లక్షలాది మందికి ఉద్యోగాలు లభించాయి. ఇంతేనా? దళితబంధు, కల్యాణ లక్ష్మి, గృహలక్ష్మి వంటి పథకాలెన్నింటినో ప్రవేశపెట్టి పేదలకు మేలు చేశారు.
చావుతప్పి కన్ను లొట్టబోయినట్టే..
తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులను కట్టి రైతులకు మేలు చేశారు. అయినా సరే.. ఇప్పుడు తెలంగాణ ప్రజానీకం కేసీఆర్ ప్రభుత్వం మాకొద్దు అంటోంది. అంతేకాదు.. తెలంగాణ తెచ్చాడన్న బీభత్సమైన సెంటిమెంటును సైతం పక్కనబెట్టేస్తోంది. ఇక బీఆర్ఎస్ ఓడిపోయినా.. ఓడిపోకున్నా కూడా భయంకరంగా శ్రమించాల్సిన అవసరమైతే ఉంది. గెలిచినా కూడా చావుతప్పి కన్ను లొట్టబోయినట్టే అవుతుంది. తెలంగాణకు ఇంత చేసిన కేసీఆర్ పరిస్థితే ఇలా ఉంటే ఏపీ సీఎం జగన్ పరిస్థితి ఎలా ఉంటుంది? సంక్షేమం తప్ప అభివృద్ధి లేదు. పరిశ్రమలు లేవు.. ఉద్యోగ కల్పన అంతకన్నా లేదు.
చంద్రబాబు చేసిన అభివృద్ధినీ తుంగలో తొక్కేశారు..
ప్రభుత్వోద్యోగులకు సమయానికి జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదు. నిరుద్యోగులకు నోటిఫికేషన్లు లేవు. అసలు రాష్ట్రానికి రాజధానే లేదు. అంతకుముందు చంద్రబాబు చేసిన అభివృద్ధిని కూడా జగన్ తుంగలో తొక్కేశారు. పైగా జగన్ మోనార్కిజం.. అన్నీ వెరసి వచ్చే ఎన్నికలు జగన్‌కు చాలా కష్టమే అనిపిస్తోంది. ఒక్క కేసీఆర్ అహంకారమే ఆయనను తొక్కేసేలా చేస్తోంది. మరి జగన్ అహంకారానికే బ్రాండ్ అంబాసిడర్. ప్రతిపక్ష పార్టీ అధినేతను జైలుకు పంపేందుకు ఆయన అవలంభించిన పద్ధతులు జనంలో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. కేసీఆర్ ప్రజాస్వామ్యం, ప్రతిపక్షాలను గౌరవించకపోవడం వల్లనే నేడు ఇంతటి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తోంది. మరి జగన్‌కు ప్రజాస్వామ్యం అంటే ఏంటో కూడా తెలియదు. ప్రతిపక్షాలను ఎలా ఇబ్బందిపెట్టాలనేది తెలుసు తప్ప గౌరవించడం అనే మాటే ఉండదు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో జగన్ చుక్కలు చూడటం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.