ఏపీలో వైసీపీ ప్రభుత్వం నియంతృత్వానికి పరాకాష్ట. ఏం చేయాలనుకుంటే అది మంచా? చెడా? అని ఆలోచించకుండా చేసేస్తుంది. తమ అధికారానికి అడ్డుగా ఎవరైనా వచ్చినా.. వస్తున్నారని భావన వస్తే చాలు తొక్కేస్తున్నారు. తాజాగా వైసీపీ చూపు ఉపాధ్యాయులపై పడింది. వాళ్లేం చేశారంటారా? ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదు. పాల్గొంటే తాము దర్జాగా చేయాలనుకున్నది చేయలేం. వారి స్థానంలో వలంటీర్లను రంగంలోకి దింపితే ఏం చేయాలనుకుంటే అది చేసేయవచ్చు. ఇది వైసీపీ స్కెచ్. ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమీషన్ సన్నాహాలు ప్రారంభించింది.
బోధనేతర పనుల నుంచి మినహాయిస్తూ జీవో..
ఎన్నికల విధులలో పాల్గొనే అధికారులు, ఉద్యోగుల జాబితాను పంపించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు.. వివిధ శాఖల హెచ్ఓడీలకు వివరాలు కోరుతూ ఆదేశాలు జారీ చేసింది. అంతా బాగానే ఉంది కానీ ఇది వైసీపీకి షాకింగ్ పరిణామంలా అనిపించింది. ఈ క్రమంలోనే ఉపాధ్యాయులను ఎన్నికల విధుల నుంచి తప్పించేందుకు భారీ స్కెచ్ గీసింది. నిజానికి రాష్ట్రంలో ఉపాధ్యాయులందరినీ భోధనేతర పనుల నుంచి మినహాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చాలా తెలివిగా గత ఏడాదే జీవో జారీ చేసింది. ఎన్నికల విధుల్లోకి వారిని రానీయకుండా బిగ్ స్టెప్ అయితే తీసుకుంది. వారికి బదులు తమ నేతల కనుసన్నలలో మెలిగే సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధులలో ఉపయోగించుకోవాలనుకొంది.
సంజాయిషీ కోరుతూ మెమోలు..
కేంద్ర ఎన్నికల కమిషన్ మాత్రం ఉపాధ్యాయులు ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో కంగుతిన్న వైసీపీ ప్రభుత్వం ఎన్నికల విధులకు ఉపాధ్యాయులను దూరంగా ఉంచేందుకు మరో కొత్త ఐడియా సిద్ధం చేసింది. తమ ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్నట్లు భావిస్తున్న ఉపాధ్యాయులకు క్రమశిక్షణ ఉల్లంఘన పేరిట చార్జ్ మెమోలు జారీ చేస్తోంది. ఇప్పటికే కొన్ని జిల్లాలలో కనీసం వంద మంది ఉపాధ్యాయులకు సంజాయిషీ కోరుతూ మెమోలు జారీ చేసింది. దీనికి రకరకాల కారణాలు చెబుతోంది. తద్వారా వారిని ఎన్నికల విధులకు అనర్హులుగా చేసి దూరంగా ఉంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి వైసీపీ ప్రభుత్వం అయితే ఉపాధ్యాయులను ఏదో ఒక విధంగా ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ప్రయత్నిస్తోంది. మరి ఇది ఎంతమేర సఫలీకృతమవుతుందో చూడాలి.