తెలంగాణ శాసనసభ ఎన్నికలు ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి. అసలు ఈ ఎన్నికలు ఈసారి ఎందుకోగానీ ఓ పట్టాన ఎవరికీ అర్థం కావడం లేదు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీలు హోరాహోరీగా పోరాటమైతే చేస్తున్నాయి. కానీ ఒకదానితో మరొక పార్టీకి లోపాయికారీ ఒప్పందం ఉందన్న టాక్ అయితే నడుస్తోంది. కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ గెలవడం, తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకోవడంతో దానిని ఎలాగైనా తొక్కేయాలని తెలంగాణలో మిగిలిన రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని.. వాటి అంతిమ లక్ష్యం ఒక్కటే కాబట్టి పైకి ఒకదానిపై మరొకటి కత్తులు దూస్తున్నా.. లోలోపల మాత్రం కలిసి పోరాడుతున్నాయనే టాక్ నడుస్తోంది.
ఇలాంటి ఆలోచన జనానికి రానివ్వకూడదంటే..
కామన్ శత్రువును ఎదుర్కొనేందుకు రెండు పార్టీలు కలిసికట్టుగా నడుస్తాయని జనంలో కూడా చర్చ నడుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్‌ను అడ్డుకునేందుకు గులాబీ పార్టీ నేతలైతే బీభత్సమైన యుద్ధం చేస్తున్నారు. కర్ణాటక ఓటమి తర్వాత.. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, మిజోరాం రాష్ట్రాలలో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను తొక్కేయాలని బీజేపీ యత్నిస్తోంది. ఒకవేళ ఈ ప్రాంతాల్లో ఓడిపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీకి తిరిగి బీభత్సమైన బలం వచ్చేస్తుంది. ఈ క్రమంలోనే బీజేపీ పూర్తిగా వీక్ అయిపోయిందనే ప్రచారం జరుగుతుంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇలాంటి ఆలోచన జనానికి రానివ్వకూడదంటే.. కాంగ్రెస్‌ను గెలవనీయకూడదు.. దీనిని అడ్డుకోవాలని బీజేపీ గట్టిగానే ప్రయత్నిస్తోంది.
అధికారపక్షంపై ఈడీ, ఐటీ రైడ్స్ జరగాలి కానీ..
ఈ క్రమంలోనే బీఆర్ఎస్‌తో చేతులు కలిపిందని టాక్. తెలంగాణలో బీజేపీ గెలిచే అవకాశమే లేదు. ఈ విషయం ఆ పార్టీ అధిష్టానానికి కూడా స్పష్టంగానే తెలుసు. అయినా అగ్ర నేతలంతా తెలంగాణకు క్యూ కడుతున్నారు. దీని వెనుక మోటివ్.. బీజేపీని గెలిపించుకోవాలని కాదు.. బీఆర్ఎస్‌ని గెలిపించాలని అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. నిజానికి జరుగుతున్న పరిణామాలు కూడా అలాగే అనిపిస్తున్నాయి. అధికారపక్షంపై ఈడీ, ఐటీ రైడ్స్ జరగాలి కానీ ప్రతిపక్షంపై రైడ్స్ చేయించడమే దీనికి నిదర్శనమని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. ఐటీ దాడులతో కాంగ్రెస్ అభ్యర్థుల డబ్బును సీజ్ చేయించి తద్వారా లబ్ది పొందే యత్నం బీజేపీ చేస్తోందంటున్నారు. మొత్తానికి బీజేపీ గెలవడం కోసం కాదు.. బీఆర్ఎస్ గెలుపు కోసం ఆ పార్టీ అధిష్టానమంతా శ్రమిస్తోందని కాంగ్రెస్ విమర్శిస్తోంది.