2019 నాటి సీన్ రిపీట్.. టీడీపీ ప్లేస్‌లో బీఆర్ఎస్ అంతే..!
2019 నాటి సీన్ రివర్స్ కాబోతోందా? అప్పటి ఏపీ వైసీపీ స్థానంలో.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ.. అప్పటి టీడీపీ స్థానంలో బీఆర్ఎస్ ఉన్నాయి. ఈ విషయం వినగానే ఈ సారి అదే సెంటిమెంట్ ఇక్కడ కూడా వర్కవుట్ అయ్యిందో దెబ్బ పడేది బీఆర్ఎస్‌కే. అసలు అప్పడు ఏపీలో ఏం జరిగింది? దానికి తెలంగాణకు లింకేంటి? అసలు అప్పటి విషయం ఇప్పుడెందుకు ప్రస్తావనకు వచ్చింది అంటారా? పరిణామాలు ఇక్కడ కూడా రిపీట్ అవుతున్నాయి కాబట్టి చర్చించుకోక తప్పడం లేదు. ఇదే జరిగిందంటే మాత్రం కేసీఆర్ డిసెంబర్ 3 తర్వాత ప్రగతి భవన్‌ను ఖాళీ చేయాల్సి ఉంటుంది అందులో సందేహమే లేదు.
జగన్ వచ్చి ఏదో చేసేస్తాడని...
రైతుబంధు, 2019 ఎన్నికల ఫలితాలు.. హైకోర్టు తీర్పు.. వీటిలో ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నాయి. ఏపీలో 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీకి ఎదురు గాలి వీచింది. ఎందుకోకానీ జనానికి అభివృద్ధి రుచించలేదు. లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాన్ని ఒక్కసారే పైకి తీసుకురాలేదన్న ఆవేదనో మరొకటో కానీ వైసీపీ అధినేత జగన్ వచ్చి ఏదో చేసేస్తాడని భావించారు. ఒక్క ఛాన్స్‌కు తలొగ్గారు. ఇదంతా అప్రస్తుతం. అయితే అప్పుడు టీడీపీకి ఇబ్బందికరంగా పరిస్థితులు మారుతున్నాయన్న విషయాన్ని గమనించిన చంద్రబాబు.. సరిగ్గా ఎన్నికల ముందు పసుపు కుంకుమ పథకం పేరట డ్వాక్రా మహిళలకు అందిస్తున్న నగదును.. వారి వారి ఖాతాల్లోకి బదిలీ చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చంద్రబాబు అనుకున్నారు.
సీన్ కట్ చేస్తే..
విషయాన్ని గమనించిన వైసీపీ.. పసుపు కుంకుమ పథకాన్ని నిలిపివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది. ఇరువురి వాదనలు విన్న మీదట హైకోర్టు వైసీపీ వాదనను కొట్టేసింది. ఎన్నికల షెడ్యూల్ రాక ముందు నుంచి అమలవుతున్న పథకం కాబట్టి దానిని అమలు చేయవచ్చని తీర్పు ఇచ్చింది. దీంతో ఊపిరి పీల్చుకున్న టీడీపీ ప్రభుత్వం సరిగ్గా పోలింగ్ తేదీకి కొన్ని గంటల ముందు లబ్ధిదారులకు చెక్‌లను పంపిణీ చేసింది. కానీ సీన్ కట్ చేస్తే.. వైసీపీకి భారీగా సీట్లు.. టీడీపీ ఢమాల్. ఇప్పుడు కేసీఆర్ కూడా అదే చేస్తున్నారు. బీఆర్ఎస్‌కు ఎదురు గాలి వీస్తున్న విషయాన్ని గ్రహించి రైతుబంధుకు తెరదీశారు. అయితే కాంగ్రెస్ పార్టీ రైతుబంధును నిలిపివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించింది. సేమ్ సీన్ రిపీట్.. ఎన్నికలకు ముందు నుంచి అమలవుతున్న పథకం కాబట్టి హైకోర్టు గో ఏ హెడ్ అనేసింది. ఇక బీఆర్ఎస్ రైతుబంధుకు మార్గం సుగమం అయ్యింది. ఇక తెలంగాణలో బీఆర్ఎస్‌కు టీడీపీ పరిస్థితి వస్తుందా? లేదంటే గెలిచి నిలుస్తుందా? అనేది చూడాలి.