టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఒకరకంగా ఇది ఏపీ సీఎం జగన్‌కు బిగ్ షాక్ అని చెప్పాలి. చంద్రబాబును ఎలాగైనా కేసుల్లో ఇరికించేసి తిరిగి జైలుకు పంపాలన్న జగన్ ఆశయానికి గట్టి దెబ్బే తగిలింది. ఐఆర్‌ఆర్, ఇసుక కేసుల్లో తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు చంద్రబాబు విషయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. సీఐడీ తరపున అడ్వకేట్ జనరల్ వాదనల కోసం ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసును ఈ నెల 29న, ఇసుక కేసును ఈనెల 30కి హైకోర్టు వాయిదా వేసింది.
ఈ కేసుల్లో అసలేం జరిగిందంటే...
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై నమోదైన ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పు కేసు, ఇసుక కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కావాలంటూ ఆయన తరపు న్యాయవాదులు నిన్న(గురువారం) సాయంత్రం వరకు వాదనలు వినిపించారు. ఇక ఈ కేసులకు సంబంధించి అడ్వకేట్ జనరల్ వాదనలు నేడు వినిపించాల్సి ఉండగా.. ఆయనన వేరే కోర్టులో ఉన్నారని సీఐడీ తరపున అడిషనల్ పీపీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే అడ్వకేట్ జనరల్ వాదనల కోసం ఐఆర్‌ఆర్ కేసును ఈనెల 29న, ఇసుక కేసును ఈనెల 30కి వాయిదా వేసింది.
అయితే ఈ రెండు కేసుల్లో కూడా తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ చంద్రబాబు విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలూ తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఇక చంద్రబాబుపై మోపిన మద్యం కేసులో ఇప్పటికే అటు బాబు.. ఇటు ప్రభుత్వం తరుఫు వాదనలు పూర్తయ్యాయి. సోమవారం కోర్టు సమయం ముగిసే లోపు రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. ఆ వెంటనే తీర్పు వెలువడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.