ఏపీ సీఎం జగన్‌కు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. అక్రమాస్తుల కేసులో గత పదేళ్లుగా ఆయన బెయిల్‌పై ఉంటున్న విషయం తెలిసిందే. నేడు జగన్ బెయిల్ రద్దుపై తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. గతంలో జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామ కృష్ణరాజు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. దీంతో రఘురామ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీనిని సవాల్ చేస్తూ రఘురామ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నేర తీవ్రతను గుర్తించి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును రఘురామ కోరారు.
కాగా.. జగన్ బెయిల్ రద్దు కేసును వేరే రాష్ట్రాని(ఢిల్లీ)కి బదిలీ చేయాలన్న కేసుతో పాటు బెయిల్ రద్దు పిటిషన్‌నూ విచారించాలని సుప్రీం ధర్మాసనం సూచించింది. రఘురామ పిటిషన్‌పై జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ నిర్వహించింది. జగన్, సీబీఐ సహా ప్రతివాదులందరికీ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇప్పుడే బెయిల్ రద్దు చేయాలా? అని ధర్మాసనం పిటిషనర్‌ను ప్రశ్నించింది. అయితే ముందు నోటీసులు ఇచ్చి తదుపరి ప్రక్రియ చేపట్టాలని రఘురామ న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ సుప్రీంను కోరారు. విచారణను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మార్చాలని రఘురామ ఇప్పటికే దాఖలు చేసిన పిటిషన్‌కు జతచేయాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.
కాగా.. జగన్ బెయిల్ రద్దు చేయాలన్న రఘురామ పిటిషన్‌ను 2022 అక్టోబరు 28న తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. అప్పటి నుంచి జగన్ బెయిల్‌పైనే ఉన్నారు. అయితే రగురామ తెలంగాణ హైకోర్టులో జగన్ బెయిల్‌ను రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసిన తర్వాతే.. ఆయనను అరెస్ట్ చేసి సీఐడీ కస్టోడియల్ టార్చర్ చేసింది. అనంతరం సీబీఐ రిప్లైతో జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఇక ఇప్పుడు జగన్ కేసులో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇప్పటికే జగన్ తిరిగి జైలుకు వెళ్లడం ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది. చంద్రబాబును జైలుకు ఆయనను బయటకు రానివ్వకుండా చేయాలని జగన్ భావిస్తే.. ఆయన బయటకు వచ్చేశారు. ప్రశాంతంగా బయట తిరుగుతున్న జగన్ తిరిగి ఊచలు లెక్కపెట్టే సమయం ఆసన్నమైందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి.