ఏపీలో టీడీపీ, జనసేనల మధ్య పొత్తు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆసక్తికరంగానూ.. హాట్ టాపిక్‌గానూ మారిన విషయం ఏంటంటే.. బీజేపీ వీరితో కలుస్తుందా? లేదా? ఇక్కడ జనసేనతో బీజేపీ ఎప్పటి నుంచో పొత్తులో ఉంది. ఇటీవల జనసేన వెళ్లి టీడీపీతో పొత్తు పెట్టుకుంది. బీజేపీ మాత్రం సైలెంట్. కానీ జనసేనతో పొత్తులోనే ఉన్నామని చెబుతోంది. ఇటీవల ఏపీలో పర్యటించిన బీజేపీ కీలక నేతలు బీఎల్ సంతోష్, ఎంపీ జీవిఎల్ నరసింహారావు జనసేనతో పొత్తు ఉందని చెప్పారు కానీ టీడీపీ, జనసేన కూటమితో చేరే విషయంలో మాత్రం మౌనం వహించారు. అసలు టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సంబంధాలపై ప్రజలకే కాదు.. చివరకు బీజేపీ నేతలకు సైతం అంతుబట్టడం లేదు.
బీజేపీ మౌనం ఎందుకో..
అయితే జనసేన మినహా వేరే పార్టీతో పొత్తు గురించి అధిష్టానం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందని దీని గురించి ఎవరూ మాట్లాడవద్దని పార్టీ నేతలకు అగ్ర నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక జనసేన, టీడీపీలు అయితే పొత్తుతో దూసుకుపోతున్నాయి. ఉమ్మడి మేనిఫెస్టోని సైతం త్వరలోనే విడుదల చేయనున్నాయి. ఈ విషయాలన్నీ బీజేపీకి తెలియనివి కావు అయినా సరరే.. మౌనం ఎందుకో తెలియడం లేదు. అయితే తెలంగాణలో మాత్రం బీజేపీ, జనసేనల పొత్తు కొనసాగుతోంది. తెలంగాణలో ఎన్నికల నుంచి టీడీపీ తప్పుకుంది. అయితే అక్కడ కాంగ్రెస్‌కు టీడీపీ పరోక్షంగా మద్దతు ఇస్తోందని టాక్ నడుస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబు అయితే తాము ఎవరికీ మద్దతు తెలియజేయబోమని స్పష్టం చేశారు.
ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుచుకోవడం కష్టమే..
తమకు ఏపీ ఎన్నికలు ముఖ్యమని.. కాబట్టి ఈ తరుణంలో రెండు పడవలపై కాళ్లేయలేమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల తర్వాత మాత్రం బీజేపీ నుంచి ఏదో ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. టీడీపీ, జనసేన పొత్తులో కలుస్తుందా? లేదంటే వైసీపీతో పొత్తు పెట్టుకుంటుందా? అనేది తెలే అవకాశం ఉంది. అయితే ఒంటరిగా మాత్రం పోటీ చేయదని సమాచారం. ఎందుకంటే ఒంటరిగా బీజేపీ పోటీ చేస్తే.. ఏపీలో ఒక్కటంటే ఒక్క సీటు గెలుచుకోవడం కూడా కష్టమే. ఈ విషయం బీజేపీకి కూడా తెలుసు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వైసీపీపై చేస్తున్న విమర్శల వెనుక బీజేపీ ఉందని టాక్. నిజానికి బీజేపీ అధిష్టానానికి తెలియకుండా ఆ పార్టీ నేతలెవరూ ఎలాంటి స్టెప్ తీసుకోవడానికి ఉండదు. దీన్ని బట్టి చూస్తే మాత్రం లేటయినా కూడా టీడీపీ, జనసేనల కూటమిలో బీజేపీ సైతం చేరడం ఖాయంగానే కనిపిస్తోంది.