బీఆర్ఎస్ పార్టీ ఆశ, నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతోందా? అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. రోజుకో సర్వే తెలంగాణలో వెలుగు చూస్తోంది. ఒకటేమో.. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంటా.. మరొకటేమో వ్యతిరేకంగా.. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకునేలోపే వ్యతిరేక సర్వే వచ్చి నిరాశను నింపుతోంది. నిన్న న్యూస్ స్టాప్ అనే సంస్థ తెలంగాణలో బీఆర్ఎస్‌కు అధికారాన్ని కట్టబెడితే ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ బీఆర్ఎస్‌కు బ్రేకులు పడతాయని తేల్చి చెప్పారని సమాచారం. ఈ విషయాన్ని నేరుగా సీఎం కేసీఆర్‌కే చెప్పినట్టు టాక్ నడుస్తోంది. మూడు గంటల పాటు చర్చలు జరిపిన మీదట ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌కు స్పష్టంగా అర్థమయ్యేలా పీకే చెప్పారట.
తొమ్మిదేళ్ల పాలన నుంచి విముక్తి కోరుకుంటున్న జనం..
ఇంతకీ ఈ విషయం ఎలా బయటకు వచ్చిందంటారా? గురురాజ్ అంజన్ ట్వీట్‌తో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ‘‘బీఆర్ఎస్ ను నమ్మేస్థితిలో జనం లేరు. ఇప్పుడేం చేసినా వర్కవుట్ కాదు’ అని కేసీఆర్‌కు పీకే వివరించారట. నిజానికి తెలంగాణ కర్ణాటక ఎన్నికల తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ప్రజల్లో అప్పటికే బీఆర్ఎస్‌పై అసంతృప్తి బీభత్సంగా పెరిగిపోయిందని సీఎంకు పీకే తెలిపారని సమాచారం. తొమ్మిదేళ్ల పాలన నుంచి జనం విముక్తి కోరుకుంటున్నారని స్పష్టంగా చెప్పారట. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీపై ఒక మంచి ఒపీనియన్ అయితే జనంలో ఏర్పడిందని కాబట్టి నష్టం తప్పదని వివరించారట. జరగాల్సిన నష్టాన్ని అయితే అడ్డుకోలేం కాబట్టి కొన్ని ముఖ్య స్థానాలను అయినా కోల్పోకుండా చూసుకోవాలని సూచించారట.
కేడర్‌ను బతిమిలాడుకున్న కేటీఆర్..
2018 ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలోని ఐ ప్యాక్ టీమ్ తో బీఆర్ఎస్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ కూడా ఒప్పుకున్నారు. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం ఆ డీల్ కంటిన్యూ చేయలేదని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు గులాబీ బాస్.. పీకేను సంప్రదించారట. ఎన్నికలకు వారం ముందు సంప్రదించడంతో ఆయన కేవలం సలహాలు ఇచ్చి ఊరుకున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కేటీఆర్ ఈ వారం రోజులూ కష్టపడాలంటూ పార్టీ కేడర్‌ను కేటీఆర్ బతిమిలాడుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తానికి అసలు ఆ సర్వేల్లో నిజమెంతుంది? ఇప్పుడు పీకే సమాచారంలో నిజం ఎంతుందనేది తెలియాలంటే వచ్చే నెల 3వ తేదీ వరకూ వెయిట్ చేయాల్సిందే.