అయ్యో.. జంపింగ్‌లకు ఎన్ని కష్టాలో!!
ఇప్పటి వరకూ పార్టీ నుంచి అంతమంది సీనియర్లు వెళ్లిపోతున్నా బీజేపీ పెద్దలు ఎందుకు పట్టించుకోవడం లేదు? అని సర్వత్రా చర్చించుకుంటున్నారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి సహా అధిష్టానం కూడా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఇదేంటా? అని అంతా ముక్కున వేలేసుకున్నారు. కానీ బీజేపీ అధిష్టానం మాత్రం ఈ వ్యవహారాన్ని మరోవైపు నుంచి నరుక్కొస్తోంది. పార్టీ మారిన నేతలందరిపై ఐటీ, ఈడీ దాడులు చేయించి పార్టీ మారుదామనుకుంటున్న వారిని కంట్రోల్‌లో పెడుతున్నారని టాక్. పార్టీ మారుదామనుకున్న వారిని భయపెట్టాలంటే.. మారిన వారిని కేంద్ర సంస్థల చేత దాడులు చేయించాలి. ప్రస్తుతం తెలంగాణలో నడుస్తున్న వ్యవహారం ఇదే. ముఖ్యంగా బీజేపీకి రాజీనామా చేసి పార్టీ మారిన వారితో పాటు పార్టీలోకి రమ్మని ఆహ్వానించినా రాకుండా వేరే పార్టీలోకి జంప్ అయిన వారిపై బీజేపీ ఈడీ, ఐటీలను ప్రయోగిస్తోందన్న ప్రచారం బీభత్సంగా జరుగుతోంది.
ప్రతిపక్ష పార్టీ నేతలపై దాడులు చేయించడమే విచిత్రం..
నిజానికి ఐటీ, ఈడీ దాడులన్నీ కూడా బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన వారితో పాటు పార్టీలోకి రాని వారిపైనే జరుగుతుండటం ఈ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో అక్కడ అధికార పార్టీపై ఇలా కేంద్ర సంస్థలను ప్రయోగిస్తుంది కానీ ప్రతిపక్ష పార్టీ నేతలపై దాడులు చేయించడమే విచిత్రంగా అనిపించింది. ఆ తరువాత ఏ ఏ నేతలపై దాడులు జరిగాయన్న విషయాలపై ఆరా తీసిన వారికి షాక్ కొట్టినంత పనైంది. ముందుగా ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఐటీ, ఈడీ దాడులు. ఆయనను తొలుత తమ పార్టీలోకి రావాలంటూ బీజేపీ ఆహ్వానించింది. కానీ ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ వెంటనే ఆయనపై ఐటీ దాడులు జరిగాయి. ఇక ఆ తరువాత బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన వివేక్ వెంకటస్వామితో పాటు ఆయన సోదరుడిపై దాడులు జరిగాయి.
ఆస్తులు ఎలా కాపాడుకోవాలి?
వివేక్ పై ఐటీ, ఈడీ దాడులు జరిగాక కానీ అసలు ఏం జరుగుతుందనేది తెలియరాలేదు. దీంతో బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో భయం మొదలైంది. అలాగే నెక్ట్స్ ఎవరనే టాక్ కూడా మొదలైంది. ఈ క్రమంలోనే ఎన్నికల సంగతిని పక్కనబెట్టి ఆస్తులు ఎలా కాపాడుకోవాలా? అనే విషయంపై బీజేపీకి రాజీనామా చేసిన నేతలు ఫోకస్ పెట్టారట.
ఇప్పుడు ఒక్క పార్టీ మారినోళ్లనే కాదు.. ఫ్యూచర్లో మారాలనుకుంటున్నవారికి సైతం తద్వారా బీజేపీ అధిష్టానం ఇన్ డైరెక్ట్ వార్నింగ్ ఇస్తోంది. ఇక ఐటీ, ఈడీ దాడుల లిస్టులో నెక్ట్స్ మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన కాంగ్రెస్ నుంచి బీజేపీకి మారినందుకు నజరానాగా కమలం పార్టీ ఆయనకు రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చింది. అయితే ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఫలితంగా ఆయనకు పార్టీలో పెద్దగా ప్రయారిటీ దక్కలేదు. పైగా ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ బీభత్సంగా పుంజుకోవడంతో తిరిగి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. ఇప్పుడు ఐటీ, ఈడీ దాడుల అంశం ఆయనకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందట. మొత్తానికి వివేక్‌పై దాడి బీజేపీ నుంచి చేంజ్ అవుదామనుకున్న వారందరికీ దడ పుట్టిస్తోంది.