తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం వారం రోజుల సమయం మాత్రమే ఉంది. అసలు ఇప్పటికీ తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తుందనే స్పష్టత అయితే రావడం లేదు. ఈసారి కాంగ్రెస్ బాగా పుంజుకోవడంతో సందిగ్ధం ఏర్పడింది. అధికారం దక్కించుకోవడం కోసం ప్రధాన పార్టీలన్నీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి.ఈ మేరకు అధికారిక బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలని బీభత్సంగా ట్రై చేస్తోంది. అలాగే కాంగ్రెస్, బీజేపీ సైతం గట్టి ప్రయత్నమే చేస్తున్నాయి. అయితే తాజాగా ఓ సర్వే తెలంగాణలో సంచలనం రేపుతోంది. న్యూస్టాప్ అనే సంస్థ బీఆర్ఎస్ పక్కాగా హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని స్పష్టం చేసింది.
బీఆర్ఎస్‌కు 70 సీట్లు వచ్చే అవకాశం ఉందని న్యూస్ స్టాప్ తెలిపింది. కాంగ్రెస్ పార్టీకి 30కి పైగా సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే సంస్థ తేల్చింది. బీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పదేళ్ల అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళుతోంది. అయితే బీఆర్ఎస్‌పై కొంత వ్యతిరేకత కూడా ఉందని తెలిపింది. నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతుల నుంచి కొంత వ్యతిరేకత ప్రభుత్వంపై వ్యక్తమవుతోంది. మొత్తానికి బీఆర్ఎస్ అయితే 65 నుంచి 76 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని సర్వే తేల్చింది.
మలక్‌పేట్, నాంపల్లి, కార్వాన్,చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, బహదూర్‌పురా ఎంఐఎంకి అడ్డా కాబట్టి ఈ స్థానాలను కాంగ్రెస్ కోల్పోతుందని సర్వే తేల్చింది. బీఎస్పీ కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో దాదాపు 1% ఓటు బ్యాంకును కలిగి ఉంది. సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాగా జనం దృష్టిని ఆకర్షించారని.. కాబట్టి బీఎస్పీ కొంత మేర ప్రభావం చూపవచ్చని సర్వే వెల్లడించింది. సీపీఐ కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేస్తోంది. ఈ పార్టీ అక్కడ ఆధిక్యంలో ఉంది. ఇక మంచిర్యాలు, నిర్మల్, బాల్కొండ, నారాయణఖేడ్, మల్కాజిగిరి, గద్వాల్, కల్వకుర్తి, షాద్‌నగర్, మునిగోడు, ములుగు, ఖమ్మం స్థానాల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గట్టి పోటీ ఉందట. మొత్తంగా చూస్తే తెలంగాణలో వరుసగా మూడోసారి బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సర్వేలో తేలింది.