సినిమా ఇండస్ట్రీ కి సంబంధించి ఏ భాషలో అయినా క్యాస్టింగ్ కౌచ్ అనేది కొద్ది రోజులుగా దుమారాన్ని రేపుతోంది. చాలామంది హీరోయిన్స్, నటీమణులు పలువురిపై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా కోలీవుడ్ నటి ఒకరు టాలీవుడ్ సీనియర్ హీరోపై చేసిన క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. సహాయనటిగా పలు తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటించిన తమిళ నటి విచిత్ర.. కొన్నేళ్ల క్రితమే సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టి బుల్లితెర మీదకి షిఫ్ట్ అయ్యింది. ఇప్పుడు 7 వ సీజన్ లో తమిళనాట బిగ్ బాస్ లోకి వెళ్ళింది.
తమిళ్ బిగ్ బాస్ లో విచిత్ర తెలుగులోని ప్రముఖ హీరోపై చేసిన ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమైంది. విచిత్ర బిగ్ బాస్ హౌస్ లో తన అనుభవాల గురించి మట్లాడుతూ 2001 వ సంవత్సరంలో నాకు ఓ దర్శకుడు తెలుగు సినిమాలో ఆఫర్ ఇచ్చాడు. కేరళలో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆ సినిమాలో నటిస్తున్న హీరో మొదటి రోజే షూటింగ్ అయిపోయాక నన్ను తన రూముకి రమ్మన్నాడు, కానీ నేను వెళ్లలేదు. ఇక ఆరోజు నుంచి తాగేసి వచ్చి ప్రతి రోజు నేను ఉండే రూమ్ డోర్లు బాదేవారు, సెట్ లో నన్ను ఎక్కడపడితే అక్కడ తాకేవాడు.
నేను ఈ విషయంలో చాలా భయపడిపోయాను, నాకు ఫోన్ రాకుండా చూసుకోమని హోటల్ సిబ్బందిని వేడుకున్నాను, బయటికి వెళ్లకుండా గదిలోనే ఉండిపోయాను, నేను ఆ హీరో రమ్మన్నప్పుడు వెళ్ళలేదు, ఆ తర్వాత రోజు నుంచి నా చుట్టూ సమస్యలు చుట్టుముట్టాయి. నాకు తమిళ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఇలాంటి సమస్య ఎదురుకాలేదు. సినిమా కోసం వెళ్ళినప్పుడు ఉన్న హోటల్ మేనేజర్ చిత్ర యూనిట్ కి తెలియకుండా నన్ను రోజుకో గదికి షిఫ్ట్ చేస్తూ కాపాడాడు. ఆ తర్వాత అడవిలో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ హీరో నన్ను అసభ్యంగా తాకడమే కాదు, నేను ఎదురించానని అందరి ముందు కొట్టాడు. అక్కడ ఉన్న ఎవ్వరూ మాట్లాడలేదు. ఇక నేను ఉన్నహోటల్ మేనేజెర్ నాకు అండగా నిలబడ్డాడు. ఆ తర్వాత ఆ మేనేజర్ నాకు భర్త అయ్యాడు. అన్నీ తానై నన్ను చూసుకున్నాడు.
దీని గురించి నేను డైరెక్టర్ కి వెళ్లి చెబితే ఆయన నన్నే కొట్టి నువ్వు వెళ్లి ఎవరికైనా కంప్లైంట్ చేసుకొమ్మన్నారు. అక్కడే నేను నా కెరీర్ లో అత్యంత దారుణమైన క్యాస్టింగ్ కౌచ్ ని ఎదుర్కొన్నాను, అందరూ నేను పెళ్లి చేసుకున్నాకే సినిమాలకి దూరంగా ఉన్నాను అనుకున్నారు. కానీ నేను ఆ ఇష్యు జరిగాకే సినిమాలకి దూరమయ్యాను అంటూ విచిత్ర చెప్పుకొచ్చింది.
అయితే విచిత్ర అరోపణలు చేస్తున్న ఆ సీనియర్ హీరో ఎవరూ అంటూ జనాలు సోషల్ మీడియాలో వెతికేస్తున్నారు. 2001 లో కేరళలో జరిగిన ఆ తెలుగు సినిమా షూటింగ్ ఏమిటో అంటూ జల్లెడపడుతున్నారు.