వైఎస్సార్‌టీపీ ఎక్కడా? అని కొద్ది రోజుల క్రితం జనం అడిగేవారు. ఇప్పుడు అసలు ఆ పార్టీ అధినేతి షర్మిల ఎక్కడున్నారు? ఏమయ్యారు? అని అడుగుతున్నారు. కేసీఆర్‌ను గద్దె దింపేస్తానని.. రాజన్న రాజ్యం తీసుకొస్తానంటూ ఎన్నో ప్రగల్బాలు పలికిన షర్మిల ఇవాళ అసలు ఎక్కడా కనిపించడమే లేదు. కాంగ్రెస్‌తో పొత్తు అన్నారు.. ఆ పార్టీ ఒప్పుకోకపోయే సరికి ఒంటరిగా బరిలోకి దిగుతామన్నారు. అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ ఆహ్వానించారు. ఆ తరువాత లేదు.. లేదు.. మేము పోటీ చేయము.. కాంగ్రెస్‌కు మద్దతిస్తాం అన్నారు. పోనీ అంతటితో ఆగారా? కాంగ్రెస్‌కు మద్దతు పలుకుతూనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని షర్మిల దుమ్మెత్తి పోశారు.
సీన్ కట్ చేస్తే ఆమె అసలు తెలంగాణలోనే లేరు. బెంగుళూరులో మకాం పెట్టేశారు. షర్మిల ఏపీ నుంచి తెలంగాణకు వచ్చినప్పుడు ఆమెపై చాలా విమర్శలొచ్చాయి. అసలే ప్రాంతీయాభిమానం బీభత్సంగా ఉన్న రాష్ట్రం కావడంతో ఏపీ వాళ్లకు ఇక్కడ పనేంటని.. ఇక్కడ పార్టీ పెట్టడమేంటని? తెలంగాణను వ్యతిరేకించిన వారికి ఇక్కడ పనేంటంటూ విమర్శలొచ్చాయి. అయినా సరే.. తనను తాను సమర్థించుకున్నారు షర్మిల. తనకు తెలంగాణ మెట్టినిల్లని.. తనకు ఇక్కడ ఓటడిగే హక్కు ఉందని తెగేసి చెప్పారు. చాలా ధైర్యంగా తెలంగాణ రాజకీయాల్లో నెట్టుకొచ్చారు. కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. అయినా సరే... వైఎస్సార్‌టీపీని ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు.
వైఎస్సార్‌టీపీని పట్టించుకోకున్నా సరే.. ఆమె తెలంగాణలో సమస్యల గురించి పోరాడారు. మరి ఎందుకో సడెన్‌గా నిర్ణయం మార్చుకున్నారు. వైఎస్సార్టీపీని పక్కనబెట్టేశారు. కాంగ్రెస్‌కు మద్దతు తెలిపారు. దీంతో ఆమె కాంగ్రెస్ తరుఫున ప్రచారం చేస్తారని అంతా భావించారు. ఒకే ఒక్క ప్రెస్‌మీట్ పెట్టి గాయబ్ అయ్యారు. మళ్లీ కనిపించిన పాపాన పోలేదు. అసలెందుకు షర్మిల పార్టీ పెట్టారు? ఎన్నికల సమయంలో ఎందుకు మాయమయ్యారు? తెలియడం లేదు. తండ్రి రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించారు కాబట్టి ఆయన బిడ్డగా తెలంగాణను ఏలుదామనుకున్నారేమో కానీ అది సాధ్యపడలేదు. కేవలం అధికారపార్టీని తిడితే సరిపోదు. ప్లానింగ్, ప్రచారం వంటివెన్నో ఉన్నాయి. అవేమీ లేకుంటే రాజకీయం సాధ్యపడదు. పార్టీని చాపలో చుట్టేసి అటకెక్కించడం తప్ప వేరే మార్గం ఉండదు.