ఏపీ సీఎం జగనన్న చెంతనే ఉండగా.. చింతించవలదు. దేశానికి క్రికెట్‌లో వరల్డ్ కప్ రాలేదన్న బాధ అస్సలొద్దు. ఆయన ఎప్పుడో మన దేశానికి వరల్డ్ కప్ తెచ్చేశారు. కాస్తంత వ్యంగ్యంగా అనిపించినా ఇది నిజమండీ బాబు. కాదేదీ కవితకనర్హం అన్నట్టుగా.. వైసీపీ నేతలు కాదేదీ ప్రచారానికి అనర్హం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. వీరి ఆర్భాటాలు ఓ రేంజ్‌కి చేరాయి. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసమని.. రాష్ట్రం మొత్తంగా ఏసీఏ బిగ్ స్క్రీన్‌లు ఏర్పాటు చేసింది. వాటి మీద జగన్ బొమ్మలు, వీడియోలు దర్శనమివ్వడంతో అంతా అవాక్కయ్యారు. ఇక అక్కడి నుంచి మొదలు.. అసలు క్రికెట్ అసోసియేషన్‌కు రాజకీయాలతో ఏం సంబంధం ఉందని క్రికెట్ అభిమానులు విమర్శిస్తున్నారు.
పొగుడుతున్నారా? తిడుతున్నారా?
జగన్ బొమ్మలపై ట్రోల్స్, మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇక వైసీపీ వర్గమైతే.. ‘ఇప్పుడు ఇండియా టీమ్‌కు నువ్వు కావాలి’ అంటూ జగన్‌ను ఆకాశానికి ఎత్తుతున్నారు. ఇక మీమ్స్ చూసి పొగుడుతున్నారా? తిడుతున్నారా? తెలవకుండా ఉంది. ఇండియాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని.. అందుకే ఇండియా మ్యాచ్ ఓడిపోయిందంటూ రఘురామ కృష్ణరాజు వైసీపీపై వ్యంగ్యాస్త్రాలను ప్రయోగిస్తున్నారు. ఇక విపక్ష పార్టీల క్యాడర్ అయితే.. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ను మరోలా వాడుకుంటూ వైసీపీని ఒక్కాట ఆడుకుంటున్నారు. మా జగనన్న వరల్డ్ కప్ దేశానికి ఎప్పుడో తెచ్చాడంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.
తానొకటి తలిస్తే.. దైవమొకటి తలచిందని..
రోహిత్ సేన మీరు మన దేశానికి వరల్డ్ కప్ తీసుకురాలేక పోయినందుకు బాధపడవద్దని అందరినీ విపక్ష పార్టీలకు చెందిన కేడర్ కోరుతున్నారు. ఎందుకంటే జగనన్న ఎప్పుడో ఏపీకి వరల్డ్ కప్ తెచ్చేశారని పిక్స్ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. జగన్ రాష్ట్రానికి తెచ్చిన ‘వరల్డ్ కప్ మందు బాటిల్’తో ప్రభుత్వాన్ని ఫుట్‌బాల్ ఆడేస్తున్నారు. మొత్తానికి తానొకటి తలిస్తే.. దైవమొకటి తలచిందని.. జగన్ ఏదో అనుకుని స్క్రీన్‌లు ఏర్పాటు చేయించి తన బొమ్మలు, వీడియోలు పెట్టించుకుంటే కావల్సినంత ప్రచారం అయితే జరిగింది కానీ అది జగన్ వ్యతిరేక ప్రచారం కావడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. మొత్తానికి వరల్డ్ కప్ మిస్ అయ్యిందన్న బాధ నుంచి ఇలా తమను నవ్వించి జగనన్న కూల్ చేశారని వ్యతిరేకవర్గమంతా హ్యాపీ ఫీలవుతోంది.