ఏపీ బీజేపీ చీఫ్‌గా దగ్గుబాటి పురందేశ్వరి ఏ ముహూర్తాన రాష్ట్ర చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారో ఏమో కానీ ఆమెపై అధికార పార్టీయే కాకుండా సొంత పార్టీ నుంచి కూడా కొందరు నేతలు విమర్శలు గుప్పిస్తున్నారట. ఇది జనం నుంచి వస్తున్న కామెంట్స్ కాదు.. అధికార పార్టీ చేస్తున్న ప్రచారం. అధికార పక్షం బాధేంటంటే.. ఆమె ఎక్కడ టీడీపీకి ఫేవర్ అవుతారో.. టీడీపీకి ఫేవర్‌గా తమ అధిష్టానం దగ్గర ఎక్కడ మాట్లాడుతారోననే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఆమెగానీ బీజేపీ అధిష్టానానికి టీడీపీని దగ్గర చేశారో ఇక అక్కడ మన పప్పులుడకవని.. కేంద్రం నుంచి అప్పులు కానీ.. కేసుల నుంచి తప్పించుకోవడం వంటి విషయాల్లో సాయం అందదని వైసీపీ దిగులు చెందుతోంది.
తమ బాధను బీజేపీ నేతలపై రుద్ది..
ఈ క్రమంలోనే సొంత మీడియా చేత పురందేశ్వరిపై వ్యతిరేక వార్తలు రాయిస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే విషం కక్కిస్తోంది. పురందేశ్వరి పార్టీ రాజకీయ ప్రయోజనాలను పక్కనబెట్టి.. చంద్రబాబు లాభం చేకూర్చేందుకు శ్రమిస్తున్నారంటూ తమ బాధను బీజేపీ నేతలపై రుద్ది మరీ ప్రచారం చేస్తోంది అధికార పార్టీ. మళ్లీ వెంటనే బయటపడిపోయారు. చంద్రబాబుకు లాభం చేకూర్చే పనులు చేస్తున్నారు కాబట్టే నిత్యం వైసీపీ రాజ్యసభ సభ్యుడు తీవ్రస్థాయిలో సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారట. రాసే వాళ్లకు బుర్ర లేదా? లేదంటే రాయించే వాళ్లకు లేదేమో కానీ మొత్తానికి పురందేశ్వరిపై తమ కోపం వెనుక అసలు కారణాన్ని వెంటనే బయట పెట్టేశారు.
కౌంటర్ ఇవ్వకూడదా?
పురందేశ్వరిపై విమర్శలను టీడీపీ నేతలు తిప్పికొడుతున్నారని దానికి కూడా విమర్శలే. తమ ప్రియతమ నేత స్వర్గీయ ఎన్టీఆర్ కుమార్తె ఆమె. ఆమెపై విమర్శలు చేస్తే టీడీపీ నేతలు స్పందించకుండా ఎలా ఉంటారు? దానిలో పురందేశ్వరికి వచ్చిన అవమానం ఏముంటుంది? అసలు వీళ్ల బాధేంటి? పురందేశ్వరిపై వీళ్లు ఇష్టానురీతిన విమర్శలు చేస్తూ పోతుంటే ఎవరూ నోరు మెదపకూడదా? కౌంటర్ ఇవ్వకూడదా? ఇస్తే వాళ్లను కూడా విమర్శిస్తారా? ఇదేం పద్ధతి అంటూ రాజకీయ వర్గాల్లో వైసీపీ తీరుపై చర్చ జరుగుతోంది. తొలుత చంద్రబాబు.. ఆ తరువాత నారా లోకేష్.. ఆపై పవన్ కల్యాణ్.. ఇప్పుడు పురందేశ్వరి. ఎవరో ఒకరిని తిట్టడమే వైసీపీ రాజకీయమా? అని సామాన్య ప్రజానీకం సైతం ప్రశ్నిస్తోంది. మొత్తానికి వైసీపీ నేతలు ఎవరో ఒకరిని ఆడిపోసుకోవడం తప్ప చేసేదేమీ లేదని విమర్శలు వస్తున్నాయి.