వైసీపీ నేతలకు ఎప్పుడూ టీడీపీ అధినేత చంద్రబాబు.. లేదంటే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. అదీ కాదంటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వీళ్లే కనిపిస్తుంటారు. తమ జిల్లా లేదంటే నియోజకవర్గాన్ని ఎలా బాగుచేసుకోవాలనే ఆలోచనే ఉండదు. ఇప్పుడు కొత్త యువ నాయకుడు నారా లోకేష్ ఎక్కడా? అంటూ సాగదీస్తున్నారు. 20 రోజులుగా నారా లోకేష్ కనిపించడం లేదట. టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్ వచ్చిన తర్వాత అసలాయన జాడ జవాబు లేకుండా పోయారట. వీళ్లసలు నారా లోకేష్ కనిపించడం లేదని అంతలా బాధపడటానికి కారణమేంటి? తమకు విమర్శించడానికి అస్త్రాలేమీ దొరకడం లేదన్న ఆవేదనా?
యువగళం పాదయాత్రకు మళ్లీ రూపకల్పన..
జనసేన - టీడీపీ పొత్తు ప్రకటన వచ్చింది. ఆ తరువాత నారా లోకేష్ తండ్రి కోర్టు పనుల మీదే బిజీగా ఉండిపోయారు. ఢిల్లీలో న్యాయనిపుణులకు అందుబాటులో ఉంటూ వచ్చారు. ఇక చంద్రబాబుకు మధ్యంత బెయిల్ వచ్చింది. ఆ తరువాత టీడీపీ - జనసేన సంయుక్త అజెండా రూపకల్పన, ఉమ్మడి మేనిఫెస్టో.. ఆత్మీయ సమ్మేళనాలు వంటి వాటి పనుల్లో బిజీ అయిపోయారు. ఇక ప్రస్తుతం అయితే యువగళం పాదయాత్రకు మళ్లీ రూపకల్పన చేసుకుంటున్నారు. ఆ పనుల్లో బిజీగా ఉంటున్నారు. ఈ యువగళం పాదయాత్ర ఈ నెల 24 నుండి తిరిగి ప్రారంభం కానుంది. ఎక్కడ ఆపేశారో తిరిగి అక్కడి నుంచే ప్రారంభిస్తారో.. లేదంటే మరో ప్లేస్ దేని నుంచైనా యాత్రను చేపడతారా అనేది తెలియాల్సి ఉంది.
యువగళం పాదయాత్రను విశాఖలోనే ముగిస్తారట..
అయితే యువగళం పాదయాత్ర ముగింపుపై మాత్రం క్లారిటీ వచ్చింది. విశాఖలో పాదయాత్రను ముగించే యోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. విశాఖలోనే ఎందుకు ముగించడం అంటారా? దీనికీ ఓ కారణముంది. టీడీపీ అధినేత చంద్రబాబు గతంలో వస్తున్న మీకోసం పాదయాత్రను విశాఖలోనే ముగించారు. అదే సెంటిమెంటుతో నారా లోకేష్ సైతం తన యువగళం పాదయాత్రను విశాఖలోనే ముగించాలని నిర్ణయించారు. చంద్రబాబు అరెస్టుతో సెప్టెంబర్ 9వ తేదీన యువగళం పాదయాత్ర నిలిచిపోయింది. ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. పైగా పొత్తులో భాగంగా చేయాల్సిన కార్యక్రమాలు కూడా చాలానే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పాదయాత్రను కుదించే యోచనలో పార్టీ వర్గాలు ఉన్నట్టు సమాచారం.