ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీని అధికారం నుంచి దింపడమే లక్ష్యంగా టీడీపీ-జనసేనలు కలిసి నడుస్తున్నాయి. గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడంతో ఓట్లు చీలిపోయి రెండు పార్టీలు పరాజయం పాలయ్యాయి. అది వైసీపీకి బాగా కలిసొచ్చింది. కానీ ఇప్పుడు అలా ఓట్లు చీలొద్దనే ఉద్దేశంతో రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నాయి. కానీ కేడర్‌లో సఖ్యత లేక చీలిపోతేందే. అది అధినేతలు గుర్తించడం లేదా? లేదంటే వాళ్లే కలుస్తారులే అని సైలెంట్‌గా ఉండిపోతున్నారా? ఏ నష్టం జరగకూడదని ఇరు పార్టీలు కలిశాయో ఆ లక్ష్యమే నెరవేరకుంటే ఎలా? అన్ని నియోజకవర్గాల్లో ఆత్మీయ సమావేశాలు పెట్టాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిసైడ్ చేశారు.
జనసేనతో పొత్తు కొనసాగిస్తాం..
ఆత్మీయ సమ్మేళనం మాటేమో కానీ రెండు పార్టీల కార్యకర్తలు నువ్వా.. నేనా? అంటున్నాయి. బాహాబాహీలకు దిగుతున్నాయి. పైకి పొత్తు బాగానే కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు కలిసి పని చేసే పరిస్థితి కలనిపించడం లేదు. అన్నింటికంటే ముఖ్యంగా.. పొత్తులో ఏ సీటు ఏ పార్టీకి పోతుందో.. తమకు కావల్సిన సీటు దక్కకుండా పోతుందననే భయం నేతలను వెంటాడుతోంది. ఈ రెండు పార్టీలే క్షేత్రస్థాయిలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటే జనసేనతో పొత్తు కొనసాగిస్తామని ఏపీ బీజేపీ చెప్పడం గమనార్హం. మొత్తానికి సీటు కోసం పోటీ అయితే పెరిగింది. ఇప్పుడు మరింత రచ్చ ఉండే అవకాశం ఉంది. ఓవరాల్‌గా లబ్ధి అయితే చేకూరుతుంది కానీ అనుకున్న ప్రయోజనం మాటేంటి?
శ్రమకు ఫలితం దక్కకుంటే ఎలా?
అధికారం దక్కుతుందా? చేతి దాకా వచ్చి కుమ్ములాటలతో జారి పోతుందా? ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేనకు బాగా పట్టుంది. అక్కడి నుంచి పోటీ చేయాలని జనసేన నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. ఇలాంటి తరుణంలో పొత్తులో భాగంగా తమ సీటుకే ఎసరొస్తే అన్న భయం అక్కడి జనసేన నేతల్లో బాగా ఉంది. ఈ క్రమంలోనే ఇరు పార్టీలు గొడవలకు దిగుతున్నాయి. టీడీపీ, జనసేన లీడర్లు నియోజకవర్గాల్లో ఎవరికి వారే టిక్కెట్లపై ఆశలు పెట్టుకున్నారు. గత నాలుగున్నరేళ్ళుగా తమ నియోజకవర్గం కోసం శ్రమించామని.. ఇప్పుడు తమ శ్రమకు ఫలితం దక్కకుంటే ఎలా? అని పార్టీ నేతలు యోచిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు పార్టీలు గొడవలకు దిగుతున్నాయి. ఇక బీజేపీ కూడా ఈ రెండు పార్టీలతో చేరితే గొడవ మరింత ముదిరే అవకాశం ఉంది. కాబట్టి పార్టీల అధిష్టానం అలర్టై కేడర్‌ను శాంతింపజేస్తే బాగుంటుందని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.