ఫైనల్ ఫోబియా మరోసారి భారత ఆటగాళ్లను వెంటాడింది. ఫలితంగా కప్పుపోయి.. కన్నీళ్లే మిగిలాయి. ఆదివారం క్రికెట్ ప్రపంచకప్ 2023 ఫైనల్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించి.. 6వసారి ప్రపంచకప్‌ను కొట్టుకుపోయింది. 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 43 ఓవర్లలో 4 వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని అందుకుని చరిత్ర సృష్టించింది. ఎన్నో ఆశలతో ఉన్న భారత ఆటగాళ్ల, అభిమానుల ఆశలపై నీళ్లు చల్లేసింది. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ వెన్నెముకలా నిలబడి ఆసీస్‌కు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ను ఆసీస్ బౌలర్లు బెంబేలెత్తించారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు భారత్ ఆలౌటైంది. 241 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన ఆసీస్ ఓపెనర్లు.. భారత బౌలర్లకు ఛాన్స్ ఇవ్వలేదు. ఓపెనర్ వార్నర్‌ను 7 పరుగులకే షమీ అవుట్ చేసినా.. మరో ఓపెనర్ హెడ్ తన ఫామ్‌ని కొనసాగిస్తూ.. 120 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 137 పరుగులు చేసి.. భారత్‌కు ప్రపంచకప్ దక్కకుండా చేయడంలో కీలక పాత్ర పోషించాడు. వార్నర్ అవుట్ తర్వాత వచ్చిన మార్ష్ (15)ను, స్మిత్ (4)ను వెంటవెంటనే బుమ్రా పెవిలియన్‌కు పంపించినా.. మార్నస్ లబుషేన్ భారత బౌలర్లకు పరీక్ష పెట్టాడు. 110 బంతులు ఆడిన లబుషేన్ 4 ఫోర్లతో 58 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. విజయానికి ఇంకా రెండు పరుగులు అవసరం ఉన్న సమయంలో హెడ్‌ని సిరాజ్ అవుట్ చేశాడు. ఆ రెండు పరుగులను మాక్స్‌వెల్ పూర్తి చేసి ఆస్ట్రేలియాకు ప్రపంచకిరీటాన్ని అందించాడు. అద్భుతమైన సెంచరీతో కదంతొక్కిన హెడ్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. టోర్నీలో అద్భుతంగా రాణించిన కింగ్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికయ్యాడు. భారత బౌలర్లలో బుమ్రా 2.. షమీ, సిరాజ్ చెరో వికెట్ తీసుకున్నారు.
అయితే అజేయంగా ఫైనల్‌కు చేరిన భారత జట్టు.. మరీ ఇంత దారుణంగా ఓడిపోవడం భారత అభిమానులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. మ్యాచ్ ఓడిన తర్వాత గ్రౌండ్‌లో సిరాజ్ కూడా భోరున ఏడ్చేశాడు. కర్ణుడి చావుకి కారణాలు అనేకం అంటారు కదా.. అలానే ఈ మ్యాచ్ భారత్ ఓడిపోవడానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా భారత బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేయడమే ప్రధాన కారణం. గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ నుండి మంచి ఇన్నింగ్స్ వచ్చి ఉంటే ఫలితం వేరేలా ఉండేది. అలాగే షమీ మెరుపులు మరోసారి మెరిపించినా.. భారత్ కల నెరవేరేది. ఏదిఏమైనా గెలుపు ఓటములు సహజం. ఫైనల్ వరకు వచ్చారు అంటే ఎంతో కష్టపడితే గానీ జరగదు.. సో అందుకు ఆటగాళ్లను అభినందించాల్సిందే. ఇక కొన్ని రోజులుగా అందరినీ అలరించిన ఈ ఎపిసోడ్‌కు ఇలా ముగింపు పడింది. రేపటి నుంచి ఎవరి పని వాళ్లదే.