గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలనే ఇప్పుడు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ వల్లెవేయడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇంకా ప్రగతి భవన్‌లోనో లేదంటే ఫామ్ హౌస్‌లోనో కూర్చుంటే కుదరదని భావించిన సీఎం కేసీఆర్ రోజుకు ఏకంగా రెండు మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. శనివారం ఆయన సిద్ధిపేటలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ చాలంటోందని.. బీజేపీ వచ్చేసి మోటార్లకు మీటర్లు బిగిస్తామంటోందని కేసీఆర్ తెలిపారు. కానీ తాము రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు.
ఈ మాటలు ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తోందా?
పాలిచ్చే ఆవును అమ్ముకొని దున్నపోతుని తెచ్చుకోవద్దని మనవి చేస్తున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. పాలిచ్చే ఆవును అమ్ముకుని.. దున్నపోతుని తెచ్చుకోవద్దా? ఈ మాటలు ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తోందా? అవును విన్నవే.. ఒక్కసారి ఐదేళ్లు వెనక్కి వెళితే అప్పటి ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు అక్కడి ప్రజానీకానికి ఇవే మాటలు చెబుతూ వచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ పరిస్థితులు మారిపోయాయి. అప్పటి వరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అక్షయపాత్ర మాదిరిగా ఉన్న హైదరాబాద్ తెలంగాణకు పరిమితమైంది. వట్టిపోయిన గొడ్డు వంటి ఆంధ్రాను అభివృద్ధి పథంలోకి నడిపించాలంటే పెను సవాలే. ఆ సవాల్‌ను చంద్రబాబు స్వీకరించారు.
పాతాళానికి చేరుకున్న ఆర్థిక పరిస్థితి..
ఏపీని సమర్థంగా ముందుకు నడిపించడం కోసం శక్తియుక్తులన్నీ వినియోగించారు. అమరావతి నిర్మాణాన్ని చేపట్టారు. పోలవరాన్ని సైతం పూర్తి చేసే బాధ్యతను భుజస్కందాలపై వేసుకున్నారు. మొత్తానికి చాలా వరకూ ఏపీ గాడిన పడిందనుకునే లోపే ఎన్నికలు వచ్చాయి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం స్లోగన్ అందుకున్నారు. చంద్రబాబు.. పాలిచ్చే ఆవును అమ్ముకొని దున్నపోతుని తెచ్చుకోవద్దని పదే పదే కోరారు. అయినా జనం చెవులకు వినిపించలేదు. జగన్‌ని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నారు. ఆయన తొక్కిన తొక్కుడుకు ఏపీ ఆర్థిక పరిస్థితి పాతాళానికి చేరింది. అభివృద్ది అట్టడుగుకు వెళ్లిపోయింది. ఒకవేళ చంద్రబాబే ఉండి ఉండే తెలంగాణకు సైతం నష్టమే. ఒక్క పరిశ్రమ కూడా తెలంగాణకు వచ్చి ఉండేది కాదు. అందుకే సీఎం కేసీఆర్.. జగన్‌ల బంధం నేటికీ వర్థిల్లుతోంది.